ఫోబియా .. అంటే ఏం జరిగినా ఎవరిని చూసి భయపడతారో వారే కారణం అని భయపడటం. ఏ జరిగినా సరే వారినే తల్చుకుంటే అది భయంకరమైన ఫోబియా . దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఎవరు అయితే గుర్తొస్తున్నారో వారికి ఏమైనా సమస్యలు వస్తాయేమో లేదో కానీ ప్రతీ దానికి అతనే కారణం అనుకునేవారు మాత్రం తీవ్రమైన మానసిక సంఘర్షణలో ఉన్నట్లే. తెలంగాణలో ఈ పరిస్థితి బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఎంతగా అంటే ఎవరైనా తెలంగాణ సీఎం పేరు మర్చిపోతే అది.. రేవంత్ రెడ్డికి అవమానం అని భ్రమపడేంత. ఎదుటివాడి తెలివితక్కువ తనానికి రేవంత్ రెడ్డి ఎలా బాధ్యుడవుతాడు ?
ఇలా ప్రారంభించి.. ప్రతీ దానికి రేవంత్ రెడ్డినే కనిపిస్తూంటాడు. మాటల్లో.. చేతల్లో.. చివరికి కలవరింపుల్లో కూడా రేవంత్ రెడ్డి ఉంటాడేమో తెలియదు. తెలంగాణలో వారి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీని కానీ ఆ పార్టీలోని ఇతర నేతల్ని కూడా అనుకోవడం లేదు. కేవలం టార్గెట్ రేవంత్ రెడ్డి. ఉదయం లేచిన దగ్గర నుంచి తెలంగాణలో ఏం జరిగినా అదే వాదన. రేవంత్ రెడ్డితో పాటు జైల్లో ఉండి మంచిప్రవర్తనతో క్షమాభిక్ష పొందిన వ్యక్తి విషయంలోనూ అదే బాధ. రేవంత్ రెడ్డిని ఇంతగా తల్చుకోవడానికి వారెందుకు తహతహలాడుతున్నారు ?
రాజకీయంగా రేవంత్ రెడ్డి వారిని అంత ఇబ్బంది పెడుతున్నారని అనుకోవాలి. తమ కొంప ముంచుతున్నాడని ఆయనను ఏదో విధంగా బద్నాం చేయాలని కంగారు పడుతున్నారని అనుకోవాలి. రేవంత్ పాలనపై ప్రజలు విసుగుపుడితే దిలాసాగా ఉండవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయితే కడపులో చల్ల కదలకుండా ఉద్యమం నడిపారో అలా నడపవచ్చు. కానీ ఎందుకిలా ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకూ ప్రతి విషయంలోనూ రేవంత్ రెడ్డి జపం. లేని పోని ఫేక్ ప్రచారాలతో పొద్దు ప్రారంభిస్తారు. అదే ప్రచారంతో ముగిస్తారు.
రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా బలంగా లేని లోటు తెలుసు. కానీ ఆ లోటును ప్రత్యర్థులే పూర్తి చేస్తున్నారు. ఎక్కడ చూసినా రేవంత్ కనిపించేలా చేస్తున్నారు. రాజకీయాల్లో మంచి మాట్లాడుకుంటున్నారా.. చెడు మాట్లాడుకుంటున్నారా అన్నది ముఖ్యం కాదు. ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారన్నది ముఖ్యం. చాలా సార్లు నెగెటివ్ పబ్లిసిటీనే లీడర్లకు అదనపు బలం అవుతుంది. బీఆర్ఎస్ రేవంత్ అలాంటి బలం కల్పిస్తోంది.