హైదరాబాద్ మెట్రో కనీస విస్తరణకు నోచుకోవడం లేదు. చివరికి ఎన్నికలకు ముందు జన సంచారం ఉండని ప్రాంతాల మీదుగా ఎయిర్ పోర్టుకు మెట్రో ప్రకటించి కేసీఆర్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఔటర్ చుట్టూ మెట్రో ఉంటుందని చెప్పారు. కానీ ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డి ఆ మెట్రో ప్లాన్ ను రద్దు చేశారు. జనాలకు ఉపయోగపడేలా.. సిటీ రద్దీని తగ్గించేలా కొత్త మెట్రో ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. కొత్త ఏడాది రోజున ఆయన తన మెట్రో ఆలోచనలు మీడియాతో పంచుకున్నారు.
మియాపూర్ నుంచి మైండ్ స్పేస్ వరకూ ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామని .. స్పష్టం చేశారు. కొత్తగా ప్రతిపాదించబోతున్న మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన ఖర్చుతో పోలిస్తే తక్కువ వ్యయంతోనే పూర్తవుతాయని ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. గత ప్రభుత్వం ఎయిర్‌పోర్టుకు ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే ఇప్పుడు దూరాన్ని మరింతగా తగ్గిస్తామని చెప్పారు. బీహెచ్ఈఎల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ 32 కిలోమీటర్ల దూరముంటుందని ఇలా చేయడం వల్ల కొన్ని లక్షల మందికి అందుబాటులోకి వస్తుందన్నారు.
మరోవైపు ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకూ మెట్రో ఉంటుందని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ ఆస్పత్రి మీదుగా వెళ్లే మెట్రోను చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టుకి వెళ్లే లైన్‌కి లింక్ చేస్తామని వివరించారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకూ మెట్రోను పొడిగిస్తామని చెప్పారు. నిజానికి రేవంత్ చెప్పిన మెట్రో ప్రణాళికలు అమల్లోకి వస్తే పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ఎంతో మెరుగవుతుంది. ప్రణాళికల్లో కాకుండా..వేగంగా అమల్లోకి తేవాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.