రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని, జిల్లాల సంఖ్య తగ్గిస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలతో పాటు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తామన్నారు.
తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదనేది సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. 33 జిల్లాలు ఏర్పాటుచేసిన గత సీఎం కేసీఆర్ జిల్లాల పేర్లు కూడా చెప్పలేరంటున్నారు. కొన్ని జిల్లాల్లో ముగ్గురు నలుగురు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నారని .. జడ్పీ సమావేశం నిర్వహిస్తే వేదికపై ఉండేవారు తప్ప కింద ఉండే వారు లేరని విమర్శలు గుప్పించారు. అందుకే జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్ సమావేశాల్లో చర్చిస్తామని, దీనికోసం జ్యూడిషియల్ కమిషన్ నియమించి, ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
సీఎం రేవంత్ చెప్పింది అక్షరాలా నిజం. జిల్లాలు అతి చిన్నగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. కానీ జిల్లాల ను ముట్టుకుంటే రాజకీయ ఉద్యమాలు వస్తాయి. జిల్లాలను తగ్గిస్తే ప్రజలు ఒప్పుకుంటారా అని కేటీఆర్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే.. జిల్లాల ఏర్పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. పూర్తిగా రాజకీయ డిమాండ్లతోనే జరిగింది. కృత్రిమ ఉద్యమాలు చేయించి జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాలను పునర్ వ్యవస్థీకరిస్తే అలాంటి ఉద్యమాలు మళ్లీ జరిగే అవకాశం కూడా ఉంది.
జిల్లాలు రాజకీయాల కోసం కాకుండా ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించి పని పూర్తి చేస్తే ప్రయోజనం ఉంటుంది ..లేకపోతే వివాదంతో గెలుక్కున్నట్లే అవుతుంది.