రేవంత్ రెడ్డి హైదరాబాద్ శివారులో గ్రీన్ ఫార్మా సిటీకి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫార్మా సిటీ పేరుతో భూములు సేకరించారు. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రానున్నాయి. అయితే భూములు ఇచ్చిన వారికి కేవలం పరిహారంతో కాకుండా వారిని అభివృద్ధిలో భాగం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆ భూములు మావే అని… భారీ పరిశ్రమలు ఉన్న చోట్ల రైతులు దిగులు చెందుతూ ఉంటారు. వారికి పరిహారం ఇచ్చినా.. వారి రాత మాత్రం మారదు. పేదరికంలోనే ఉంటారు. అయితే పరిశ్రమ పక్కన ఉన్న వారికి మాత్రం జాక్ పాట్ తగిలినట్లవుతుంది. మొత్తంగా భూములిచ్చిన రైతులకు మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ఈ పరిస్థితిని గ్రీన్ ఫార్మాసిటీతో మార్చాలని రేవంత అనుకుంటున్నారు. గ్రీన్ ఫార్మా సిటీ లో భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించే దిశగా ప్రణాళికాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు కొన్ని సూచనలు ఇచ్చారు.
అమరావతిలో ఇచ్చినట్లుగా భూముల్లో వాటాలు ఇవ్వడం సాధ్యం కాదు. కానీ ఆ పరిశ్రమ కు కేటాయించినవి పోను పక్కన భూములు అభివృద్ధి చేసి కొంత ఇవ్వడం.. ఇతర ప్రాంతాల్లో వారికి భూములు కేటాయించడం ద్వారా అభివృద్ధిలో భాగస్వాములు చేయడం.. లేకపోతే పరిశ్రమల వల్ల వచ్చే ఉపాధి లో అవకాశాలు కల్పించడం.. శాశ్వత ఆదాయ వనరులు కల్పించేలా చూడటం వంటి వాటిపై అధికారులు వర్కవుట్ చేసే అవకాశం ఉంది. ఈ విధానం సక్సెస్ అయితే.. తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టులకు భూములు ఇచ్చేందుకు రైతులు కూడా పెద్దగా వ్యతిరేకత చూపరని అనుకోవచ్చు.