తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్న రేవంత్ రెడ్డి ఏ చిన్న అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు. గెలుస్తారు.. గెలిచే చాన్స్ ఉందని నివేదికల్లో తేలితే .. పార్టీలో లేకపోయినా.. పార్టీకి దూరమైనా… సరే వెళ్లి వాళ్లతో చర్చిస్తున్నారు. మైనంపల్లి హన్మంతరావుతో రేవంత్ రెడ్డి డీల్ సెట్ చేసుకున్న విధానం బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరిచింది. మైనంపల్లి పెట్టే గొంతెమ్మ షరతులకు కాంగ్రెస్ అంగీకరించని ఆయనకు బీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదనుకున్నారు. కానీ ఆయనను రేవంత్ చేర్చేసుకుంటున్నారు.
భువనగిరి నుంచి మొన్నటిదాకా కాంగ్రెస్ నేతగా అన్న కంభం అనిల్ రెడ్డి ఈ మధ్య బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తామన్నట్లుగా ఆశ పెట్టి చేర్చుకున్నారు. కానీ తర్వాత ఏదో పదవి ఇచ్చారు. టిక్కెట్ మాత్రం ఇవ్వలేదు. భువనగిరిలో ఆయన అయితే గెలుస్తారని కాంగ్రెస్ పార్టీ సర్వేలో తేలడంతో నేరుగా రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకున్నారు. పార్టీని వీడిపోయినా రేవంత్ నేరుగా ఇంటికే వచ్చి టిక్కెట్ ప్రకటించడం.. కేసీ వేణుగోపాల్ తో కూడా మాట్లాడించడంతో… కంభం అనిల్ ఖుషీ అయిపోయారు. వెంటనే పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు.
గెలుపు గుర్రాలుగా భావిస్తున్న మరికొందరు నేతలతోనూ రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మొత్తం అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలనుకుంటున్నారు. సునీల్ కనుగోలు బృందం .. పూర్తి స్థాయిలో యాక్టివ్ గా పని చేస్తోంది. వారి ఆలోచనల్ని రేవంత్ రెడ్డి అమల్లో పెడుతున్నారు. దీంతో హడావుడి అంతా రేవంత్ రెడ్డిదే అవుతోంది.