ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతామని ఆ బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ఆయన లాక్కోలేకుండా పీక్కోలేకుండా ఉన్నారు. రిజర్వేషన్లు 42శాతం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో చట్టం మాత్రం చేయగలిగారు. ఆ చట్టం చెల్లుబాటు కాదు. కేంద్రం ఆమోదించి రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది. ఎస్సీ రిజర్వేషన్లు పెంచినా అంతే. అయినా రేవంత్ ఎందుకు రిస్క్ తీసుకుంటున్నారు?
రిజర్వేషన్ల మంటల్లో కాలిపోయిన ఎన్నో పార్టీలు
రిజర్వేషన్లను కల్పిస్తామని ఆశ పెట్టి ఓ వర్గాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకుని తర్వాత వారి ఆగ్రహంతో ఎన్నో పార్టీలు ఇబ్బందులు పడ్డాయి. ఆ జాబితాలో బీఆర్ఎస్, టీడీపీ కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎస్సీలు, ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చి.. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అక్కడి వరకే ఆయన చేయగలిగారు. ప్రజాగ్రహం చూడాల్సి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఇటీవల ఎన్నికల్లో గెలవలేదు. 2014లో కాపు రిజర్వేషన్ల హామీ ఇచ్చిన టీడీపికి 2019లో ఎలాంటి ఫలితం వచ్చిందో అందరూ చూశారు. ఇంకా చంద్రబాబుకు ఐదు శాతం రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే కోటాలో ఇచ్చే అవకాశం లభించింది. ఇచ్చారు కూడా. అయినా ఆయన ఓటమిని తప్పించుకోలేకపోయారు.
ఉత్తరాదిలో లెక్కలేనన్ని రిజర్వేషన్ల మంటలు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఉత్తరాది వరకూ ప్రతీ రాష్ట్రంలోనూ ఈ రిజర్వేషన్ల రాజకీయాలు ఉన్నాయి. అనేక పార్టీలు తాత్కలికంగా రాజకీయ లబ్ది పొందాయి. తర్వాత వారి ఆగ్రహంతో తీవ్రంగా నష్టపోయాయి. రాజకీయంగా నష్టం జరిగితే అది ఆ పార్టీకే . కానీ వారు ఆందోళనలు చేస్తే మొత్తం రాష్ట్రం, ప్రజలు కూడా ఇబ్బందులు పడతారు. మణిపూర్ మండిపోవడానికి కూడా కారణం ఈ రిజర్వేషన్ల కోటా మంటలే. అలాంటి పరిస్థితి కల్పించకూడని పార్టీలు ఇప్పటికీ రిజర్వేషన్ల రాజకీయం చేస్తూనే ఉన్నాయి.
ఇప్పడున్న పరిస్థితుల్లో ఎవరికీ రిజర్వేషన్లు పెంచలేరు!
రిజర్వేషన్లతో రాజకీయం నిప్పుతో చెలగాటం లాంటిదే. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ గరిష్టంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. అంతకు మించి రిజర్వేషన్లు కల్పించాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాలి. అది అంత తేలికగా అయ్యే పని కాదు. రాజ్యాంగ సవరణ చేయకుండా.. రిజర్వేషన్లు కల్పిస్తామని ఏ పార్టీ హామీ ఇచ్చినా అది మభ్య పెట్టడానికే. కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ మూడింట రెండు వందల మెజార్టీతో అధికారంలోకి వచ్చి.. రాజ్యసభలోనూ అదే స్థాయి బలం సాధించినప్పుడు .. కాంగ్రెస్ చేయగలుగుతుంది. కానీ ఇపుడు కాంగ్రెస్ దేశవ్యాప్తగా వంద లోక్ సభ సీట్లు సాధిస్తే అదే మహా విజయం అయిపోతోంది. మరి ఎలా చేస్తారు ?