తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నేత హర్కర వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ సలహాదారుగా వేణుగోపాల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కసరత్తు దాదాపు పూర్తిచేసింది. దీనిలో భాగంగానే ఇటీవల మహేశ్‌కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లకు ఎమ్మెల్సీ అభ్యర్థులగా అవకాశం కల్పించింది. ప్రభుత్వ సలహాదారుల నియామకం ద్వారా నలుగురు కీలక నేతలకు అవకాశం కల్పించినట్లయింది.
కేబినెట్ హోదా పొందిన నలుగురు రేవంత్ కు అత్యంత సన్నిహితులు. టీడీపీలో ఉన్నప్పటి నుండే వేం నరేందర్ రెడ్డి.. రేవంత్ కు సన్నిహితంగా ఉంటున్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన కూడా జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరినా టిక్కెట్ కోసం ఒత్తిడి చేయలేదు. రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇప్పుడు ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చారు. అలాగే మల్లు రవి కూడా రేవంత్ కు నమ్మకమైన నేతగా వ్యవహరిస్తున్నారు. షబ్బీర్ అలీ ఏ విషయంలో అయినా రేవంత్ నే సమర్థిస్తున్నారు. ఆయనకు వేరే విధంగా న్యాయం చేయడం కష్టం కావడంతో కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. త్వరలో ఆర్టీసీ ఛైర్మన్ సహా మరికొన్ని కీలక పదవులకు ఇప్పటికే కసరత్తు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. వాటిపైనా త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.