తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారానికి రంగంలోకి దిగుతున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఏపీ బహిరంగసభ 15వ తేదీన ఖరారయింది. ఆ లోపు ఎన్నికల షెడ్యూల్ కూడా వస్తుంది. అంటే అది ఎన్నికల ప్రచార భేరీ అనుకోవచ్చు. విభజన హామీల అమలు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేకహోదా తో పాటు ఇతర అంశాలపై పోరాటానికి బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అదే వేదికపై నుంచి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది.
గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ ఏపీలో కొన్ని సార్లు పర్యటించారు. కానీ రాజకీయసభలకు హాజరు కాలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. బ హిరంగసభలో ప్రసంగించారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెట్టిన తర్వతా విశాఖలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చేయాలనుకున్నారు. చివరికి పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకం అయింది. అయితే రేవంత్ రెడ్డి జాతీయపార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా సభలో పాల్గొంటున్నారు.
ఏపీలో రేవంత్ రెడ్డిపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆయన వస్తే జన సమీకరణ పెద్ద కష్టం కాదన్న అభిప్రాయం ఉంది. ఈ కారణంతోనే రేవంత్ రెడ్డితో ఎక్కువగా ప్రచారం చేయించాలన్న ఆలోచనలోనూ ఉన్నారు. రేవంత్ కు ఎంత వెసులుబాటు ఉంటుందో కానీ.. విశాఖ సభలో ఆయన ఏం ప్రసంగిస్తారన్నది కూడా హైలెట్ కానుంది. జాతీయ రాజకీయాలపైనే మాట్లాడతారా లేకపోతే.. జగన్ పాలన.. చంద్రబాబు పైనా విమర్శలు గుప్పిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.