ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దోపిడిలకు సంబంధించిన వివరాలను ఇకపై రోజుకి ఒక పత్రం చొప్పున విడుదల చేయబోతున్నా అంటూ ప్రకటించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. డ్రోన్ కెమెరాతో అక్రమంగా చిత్రీకరించాన్న వివాదంలో ఆయనకు బెయిల్ లభించి విడుదలయ్యారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ… రేపట్నుంచీ గల్లీలోనే ఉంటాననీ, ప్రజలకు అందుబాటులో ఉంటా అన్నారు. తాను చేస్తున్న కార్యక్రమాలకు వ్యక్తిగతమైనవి అంటూ పింక్ మీడియా ప్రచారం చేసిందన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సహచరులు నమ్మారనీ, తమకు తెలియనట్టుగా కొంతమంది మాట్లాడారన్నారు. వాళ్లని తాను తప్పుబట్టడం లేదంటూ పరోక్షంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరు మీద ప్రత్యక్షంగానే విమర్శించారు రేవంత్. కాంగ్రెస్ పార్టీలో నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయడం లేరన్న అపోహలు కొంతమందిలో కలుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ నాయకుల్ని ఉత్తమ్ పిలిపించి, సమాచారం తెప్పించుకుని, కేసీఆర్ కేటీఆర్ అక్రమాలను అడ్డుకునేందుకు పోరాటం చేస్తామంటూ జన్వాడ ముట్టడికి పిలుపు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్తేజంతో పనిచేసేవారన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు… తనని పలకరించడానికి ఉత్తమ్ సార్ వస్తున్నడా అంటూ ఖైదీలూ కానిస్టేబుళ్లు అడిగారన్నారు. ఆ మాటకు తనకే మనసు చివుక్కుమందన్నారు. మీరు జైలుకి వెళ్లాక, నాయకులందర్నీ సమావేశ పరిచి, తెలంగాణ సమాజానికి ఒక స్పష్టమైన ప్రకటన ఉత్తమ్ చేసి ఉంటే బాగుండేదని తనతో చాలామంది అన్నారన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి తన విజ్ఞప్తి ఒక్కటేననీ… తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ లోకి తాను వచ్చింది పదవుల కోసమో పైసల కోసమో కాదన్నారు. కేసీఆర్, కేటీఆర్ అక్రమాలకు నిటారుగా నిలబడి పోరాటం చేయాలనే వచ్చా అన్నారు. కానీ, ఇవాళ్ల సమష్టిగా తెరాసతో పోరాడుతున్నామనే సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వలేకపోయామన్నారు.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపాన్ని బహిరంగంగానే ప్రశ్నించారు రేవంత్. మరీ ముఖ్యంగా ఉత్తమ్ నాయకత్వంపై మరోసారి బహిరంగ విమర్శలు చేశారు. తన వెంట ఎవరూ నిలబడలేదనీ, కానీ తాను పార్టీ కోసం ఒంటరిగానే పోరాడతాననే సందేశాన్ని కాంగ్రెస్ నేతలకూ ఇచ్చారు రేవంత్. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కేడర్ మీద ఎలా పనిచేస్తాయో చూడాలి? పార్టీ కోసం కష్టపడుతున్న అసలైన నాయకుడు తానే అనే ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు రేవంత్. ఈ మాటలు హైకమాండ్ కి ఎలా వినిపిస్తాయో వేచి చూడాలి. ఇంతకీ, ఈ వ్యాఖ్యలపై ఉత్తమ్ ఏంటారో మరి? మొత్తానికి, తెరాస మీద పోరాటం అంటూ రేవంత్ బయల్దేరితే… చివరికి, అది పార్టీలో అంతర్గత కలహాల అంశంగా మారిపోయినట్టుంది.