ప్రభుత్వం ఆరు నెలలే ఉంటుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లపై మొదటి సారి రేవంత్ రెడ్డి తీవ్రంగా రియాక్టయ్యారు. పండబెట్టి తొక్కుతాం.. కట్టేసి కొడతామని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఆదిలాబాద్ నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో భారీగా జన సమీకరణ నిర్వహించి .. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. మూడు నెలలకో, ఆరు నెలలకో కేసీఆర్ సీఎం అవుతారని ఎవడైనా అంటే పళ్లు రాలగోడతామని హెచ్చరించారు.
ఆ ఇంటి మీద పిట్టే ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామని బీఆర్ఎస్ జంపింగ్ జిలానీలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ నిత్యానందలాగా దేశం నుంచి పారిపోయి ఓ దీవిని కొనుక్కుని రాజుగా ప్రకటించుకోవాలని సలహా ఇచ్చారు. కేసీఆర్ ఇక ముఖ్యమంత్రి కాదు కదా కనీసం మంత్రి కూడా కాలేడని స్పష్టం చేశారు. దేశంలో రెండే రెండు కూటములు ఉంటాయని.. ఒకటి మోడీ కూటమి అని, మరొకటి ఇండియా కూటమి అని రేవంత్ వ్యాఖ్యానించారు. కానీ తమ కూటమిలోకి మాత్రం కేసీఆర్‌ను రానివ్వమని తేల్చి చెప్పారు. బీజేపీకి గానీ, బీఆర్ఎస్ గానీ 6 నుంచి 7 ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రాన్ని మళ్లీ మోడీకి అమ్ముకుంటారని మండిపడ్డారు. పదిహేను రోజుల్లో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్థి చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో రియాక్ట్ కావడంతో .. బీఆర్ఎస్ టార్గెట్ గా ఆయన రాజకీయాలు ఉంటాయన్న అంచనాలు ప్రారంభమయ్యాయి.