అల్లు అర్జున్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుదంని సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు అధికారంలో ఉన్న వారు రొటీన్‌గా చెప్పే సమాధానం ఇది. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు జగన్ కూడా ఇదే చెప్పారు. కానీ నిజంగా ఇలాంటి అరెస్టులు సీఎం వరకూ వెళ్లకుండా ఉంటాయా ?. ఇలాంటి అరెస్టులు రాజకీయంగా సున్నితమైనవి. ఖచ్చితంగా రాజకీయ ప్రభావం చూపించేవి. అందుకే ముఖ్యమంత్రికి ఖచ్చితంగా సమాచారం ఉంటుందని అంటున్నారు.
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. చట్ట ప్రకారం అరెస్టు చేయాల్సి ఉందని అనుమతి తీసుకోవడం, రెండు అరెస్టు చేయమని తన వైపు నుంచి సంకేతాలు వెళ్లడం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చి ఉండవచ్చు కానీ.. అరెస్టు చేయమని సూచించే పరిస్థితి మాత్రం ఉండదని అంటున్నారు. కానీ మరో వాదన కూడా ఉంది.
సినీ ఇండస్ట్రీ రేవంత్ రెడ్డిని అంత సీరియస్ గా తీసుకోలేదు. ఏడాదిగా ఇది నిరూపితమవుతూనే ఉంది. చివరికి తన పేరు కూడా గుర్తు పెట్టుకోలేదు. దీన్ని రేవంత్ సీరియస్ గా తీసుకున్నారని.. వాళ్లందరికీ గుర్తుండిపోయేలా చేయాలనుకున్నారని కూడా అంటున్నారు. ఏది నిజమో ఎప్పటికీ తెలియదు కానీ.. సీఎంకు తెలియకుండా మాత్రం అరెస్టు జరిగి ఉండదని అనుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం.. టాలీవుడ్ లో ఓ భయం కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.