తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అంచనాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లడంతో ఆ విజయం లభించింది. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆరు గ్యారంటీలు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డికి అసలు కష్టం తెలిసి వస్తోంది. ఖాజానాలో నిధుల్లేవు. అప్పులు అందే మార్గం లేదు. ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఎలా ఆదాయం రావాల్సి ఉన్నా కేసీఆర్ ముందే తెచ్చేసుకుని ఖర్చు పెట్టారు.
ఔటర్ రింగ్ రోడ్డు లీజు, ప్రభుత్వ భూముల అమ్మకంతో వచ్చిన డబ్బులు 19 వేల కోట్ల వరకు గత సర్కార్ ఖర్చు చేసేసింది. మద్యం టెండర్లను కూడా ముందే పూర్తి చేసి, వచ్చిన రాబడిని కూడా గత ప్రభుత్వమే ఖర్చు చేసింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో తీసుకోవాల్సిన అప్పులన్నీ మరో నాలుగు నెలలు మిగిలి ఉండగానే వాటినీ వాడేసింది. దీంతో రేవంత్ కు ఆర్థిక వెసులుబాటు లభించడం కష్టంగా మారింది.
తెలంగాణ పై మొత్తం అప్పుల భారం ఐదున్నర లక్ష్ల కోట్ల వరకూ ఉంది. వీటికి వడ్డీలకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా 1700 కోట్లు చెల్లించాల్సి వస్తుందని అంచనా. సగటున నెలకు రాష్ట్ర ఆదాయం 10,000 కోట్లుగా ఉంటే ఖర్చు ప్రతి నెలా 13 వేల కోట్లుగా తేలుతోంది. పథకాల అమలు ఖర్చు అదనం. రేవంత్ రెడ్డికి కాస్త ఆశాజనకంగా ఉన్న అంశం.. ఆదాయమే. క్రమంగా పెరుగుతున్న ఆదాయంతో.. భవిష్యత్ బాగుంటుందన్న ఆశాభావంతో ఉన్నారు.
తెలంగాణలో సంపద సృష్టించుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు చాలా ఉన్నాయని.. రేవంత్ మంచి సలహాదారుల్ని పెట్టుకుని ప్రయత్నిస్తే మేనిఫెస్టోను సులువుగా అమలు చేయవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రేవంత్ లో ఆ సామర్థ్యం ఉందనుకుంటున్నారు.