పార్లమెంట్ ఎన్నికల్లో పధ్నాలుగు సీట్లు సాధిస్తామని హైకమాండ్ కు రిపోర్టు ఇచ్చి ఎనిమిది సీట్లలోనే గెలవడంపై తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరిగిందో పరిశీలన చేయడానికి కురియన్ నేతృత్వంలో ఓ కమిటీని హైకమాండ్ పంపింది. వారు మొదటి రోజు పోటీ చేసి గెలిచిన, ఓడిన అభ్యర్థులతో సమావేశం అయ్యారు. కొంత మంది ఎమ్మెల్యేలతోనూ సమావేశం అయ్యారు. శుక్రవారం కూడా వారు కొన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతారు. క్షేత్ర స్థాయిలోనూ పర్యటించి హైకమాండ్ కు నివేదిక ఇస్తారు .
తొలి రోజు సర్వేల పద్దతి ప్రకారం రేవంత్ కు వ్యతిరేకంగా చెప్పినట్లుగా గాంధీభవన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేవంత్ ప్రధానంగా పట్టుబట్టి ఫిరాయింపులు చేయించి మరీ టిక్కెట్లు ఇప్పించుకున్న వారందరూ ఓడిపోవడం.. సొంత నియోజకవర్గంలో మహబూబ్ నగర్, సిట్టింగ్ ఎంపీగా ఎన్నికలకు వెళ్లిన మల్కాజిగిరిలోనూ ఓడిపోవడం ఆయనకు మైనస్ గా కనిపిస్తోంది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ను ఓడించి తనను బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసిన తర్వాత కూడా రేవంత్ జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మెజార్టీ వస్తే లోక్ సభ ఎన్నికల్లో అది మూడు సీట్లకు పడిపోయింది. నాలుగు చోట్ల బీజేపీకి ఆధిక్యం వచ్చింది.
మల్కాజిగిరిలో అయితే పట్నం సునీతారెడ్డికి పట్టుబట్టి సీటు ఇప్పిస్తే మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఫిరాయింపు నేతలకు టిక్కెట్లు ఇప్పింటిన మెదక్, సికింద్రాబాద్లలోనూ అదే ఫలితం వచ్చింది. ఆదిలాబాద్ లో గెలవాల్సిన సీటు కోల్పోయారన్న విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడటమే కారణమని రేవంత్ చెబుతున్నారు.. కానీ కాంగ్రెస్ ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారు బహిరంగంగా చెబుతున్నారు . ఇవన్నీ రేవంత్ కు రిమార్కులుగానే కనిపిస్తున్నాయి.