కేసీఆర్ అసెంబ్లీకి రావాలని పదే పదే రేవంత్ రెడ్డి చాలెంజ్ చేస్తున్నారు. దానికి బీఆర్ఎస్ వద్ద కౌంటర్ లేదు. అదే అదనుగా కాంగ్రెస్ నేతలు దాన్ని టీజింగ్ చేసే దశగా తీసుకెళ్తున్నారు. అసలు అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు ప్రతిపక్ష నేత హోదా తీసుకున్నారని వస్తున్న ప్రశ్నలకు ఎవరి వద్దా సమాధానాల్లేవు. ప్రజల్లోకి వెళ్లకపోతే దానికో వ్యూహం ఉందని అనుకోవచ్చు కానీ అసెంబ్లీకి రాకపోవడం వెనుక ఏమి వ్యూహం ఉందో బీఆర్ఎస్ నేతలకూ అర్థం కావడం లేదు.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అయినా రావాలని రేవంత్ పిలుపునిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం పిలవాలంటే మంత్రుల్ని పంపుతానని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ రావాలి రావాలి అని ఉద్యమం చేసేలాగా వ్యవహరిస్తూంటే బీఆర్ఎస్ వైపు నుంచి మాత్రం ఒక్క చిన్న స్పందన కూడా ఉండటం లేదు. అసలు కేసీఆర్ ఆలోచనలు ఏమిటో కూడా స్పష్టత లేకుండా పోయింది.
ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రభుత్వాన్ని మరింతగా నిలదీయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని గట్టిగా నమ్ముతున్న బీఆర్ఎస్ నేతలు.. ఆ విషయాన్ని అసెంబ్లీలో కేసీఆర్ మరింత ప్రభావ వంతంగాప్రజల ముందు పెట్టగలరని నమ్ముతున్నారు. నిజానికి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనకు ఏమైనా గౌరవాన్ని తగ్గిస్తే రాజకీయంగా అది ఆయనకు ప్లస్ అవుతుంది. ఈ విషయం ఆయనకు తెలియకేం కాదు. మరి ఎందుకు అసెంబ్లీకి రాకూడదని అనుకుంటున్నారు ?