తెలంగాణలో అధికారంలోకి వస్తామా అని ఉన్న అనుమానాలను పటాపంచలు చేసి, గెలవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించి… గెలుపు తీరానికి చేర్చిన క్రెడిట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిదే. కేసీఆర్ ను ఓడిస్తామన్న నమ్మకం లేకుండే అని చాలా మంది సీనియర్లు సైతం వ్యాఖ్యానించారంటే రేవంత్ ఎంత కసితో పనిచేస్తారో అర్థం చేసుకోవచ్చు.
అలాంటి రేవంత్ రెడ్డి నన్ను తప్పించండి… అని అధిష్టానానికి రిక్వెస్ట్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు సోనియా, రాహుల్ గాంధీలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా తానే మీడియాకు వివరించారు.
రేవంత్ రెడ్డి తప్పించని కోరింది పీసీసీ అధ్యక్ష పదవి నుండి. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడై 3 సంవత్సరాలు అవుతోంది. కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం… పీసీసీ చీఫ్ పదవికాలం 3 సంవత్సరాలు. ఆ తర్వాత కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది. లేదా పొడిగించవచ్చు. అయితే, సీఎంగా, పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి… పీసీసీ చీఫ్ పోస్టును మరొక నేతకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు.
నిజానికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారని అంతా ఊహించారు. కానీ లోక్ సభ ఎన్నికలు వెంటనే ఉండటంతో రేవంత్ రెడ్డినే అధిష్టానం కంటిన్యూ చేసింది. దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా… రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పీసీసీ చీఫ్ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాలని రేవంత్ కోరారు.
త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ పై అధినాయకత్వం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. బీసీ లేదా ఎస్సీ సామాజికవర్గ నేతకు పీసీసీ దక్కే అవకాశం ఉంది.