తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మాత్రం వద్దు.. ఆయనకన్నా మాకు స్టామినా ఎక్కువని వాదిస్తున్న నేతలు… పార్టీ పరమైన కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సొంత యాత్రలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో .. పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ అదే చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున రేవంత్ తప్ప ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ .. అప్పుడప్పుడు నల్లగొండలో ప్రచారం చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ కోసం పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ నియోజక వర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోటీకి పెట్టింది. అక్కడ కూడా సీనియర్లు ఎవరు కనిపించడం లేదు. ఎంపీ రేవంత్రెడ్డి సర్వం తానై వ్యవహరిస్తూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సీనియర్లు కూడా ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. కలిసొచ్చే ఒకరిద్దరు నేతల సహాయంతో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు.
మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకుండా… భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి లాంటి నేతలు.. సొంత యాత్రలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సైకిల్ యాత్రలు చేస్తున్నారు. ఇది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమేనని వారు కవర్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూసి.. పదవులు ఇస్తేనే ప్రచారం చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ హైకమాండ్ … అలా ఉన్నంత కాలం కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రాదని.. అంటున్నారు.