చాన్నాళ్ల తరువాత రేవంత్ రెడ్డి నోట తెలుగుదేశం పార్టీ మాట వినిపించింది! హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో, ఆయన రోడ్ షో నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభ రద్దు కావడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. దీంతోపాటు, రేవంత్ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణులు మంచి జోష్ మీద ఉన్నాయి. అయితే, రేవంత్ రోడ్ షోలో చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారు అని చెప్పొచ్చు. కాంగ్రెస్ కి ఇతర పార్టీల మద్దతు ఇవ్వాల్సిన సందర్భం వచ్చిందనీ, కేసీఆర్ ను ఎదుర్కొవాలంటే ప్రతిపక్షాలన్నింటికీ ఇదో అవకాశం అంటూ పిలుపునిచ్చారు.
మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను చెప్పేది ఒక్కటేననీ, చీలిపోతే కూలిపోతామన్నారు రేవంత్. తెలంగాణలో తెలుగుదేశం జెండా లేకుండా చేసిన కేసీఆర్ కి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చిందన్నారు. ఇక్కడ టీడీపీ పక్కాగా గెలుస్తది అనుకుంటే ఓటేసినా తప్పులేదనీ, కానీ ఇవాళ్ల టీడీపీకి ఓటేసుకుంటే కాంగ్రెస్ నష్టం జరుగుతుందీ, కేసీఆర్ కి లాభం జరుగుతుందన్నారు రేవంత్. కాంగ్రెస్ పార్టీకి ఈ ఒక్కసారీ అండగా నిలబడాలనీ, ఇది కాంగ్రెస్ కోసం తాను చెప్తలేదనీ, తెలంగాణ సమాజం కోసం, యువత కోసం, భవిష్యత్తు కోసం చెప్తున్నా అన్నారు. హుజూర్ నగర్లో తెరాస గెలిస్తే మరో బానిస కేసీఆర్ కి తోడైతడు, అంతకుమించి ఇంకేం జరగదన్నారు.
కమ్యూనిష్టులను కూడా రేవంత్ సాయం కోరారు. ఒకప్పుడు బానిస సంకెళ్లను తెంచేందుకు పోరాడిన కమ్యూనిష్టు సోదరులు, ఇప్పుడు మరోసారి తెలంగాణ సమాజానికి మళ్లీ పాత రోజులు వచ్చే పరిస్థితులున్నాయని గమనించాలనీ, కేసీఆర్ పాలనలో రజాకార్ల రాజ్యం మళ్లొస్తుంటే మీరు అక్కడిక్కడ చూడొద్దనీ, అలా చేస్తే తెలంగాణ సమాజానికి తీరని నష్టం చేసినవాళ్లు అవుతారన్నారు. భాజపా అభిమానులకు కూడా రేవంత్ విజ్ఞప్తి చేశారు. మీరు ఊకుంటూ మూడు వేలొస్తాయి, కొట్లాడితే ఆరువేలొస్తాయన్నారు. దీంతో మీ జెండా ఎగురుతదా..? లేదు కదా, కానీ మీరు ఓట్లు చీలిస్తే కేసీఆర్ కి పన్నెండు వేల లాభం జరుగుతదన్నారు.
అన్ని పార్టీల మద్దతను కూడగట్టే విధంగా రేవంత్ పిలుపునిచ్చారు. టీడీపీ, కమ్యూనిష్టులు, చివరికి భాజపా… హుజూర్ నగర్లో ఏ పార్టీ సొంతంగా ఏదో సాధించే పరిస్థితి లేదు. కాబట్టి, వారందరి మద్దతును కూడగట్టే ప్రయత్నం రేవంత్ చేశారని చెప్పొచ్చు. నాయకుల స్థాయిల్లో పొత్తుల గురించి మాట్లాడకుండా…. క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల అభిమానులు ఆలోచించి ఓటెయ్యాలంటూ ప్రేరేపించే ప్రయత్నం చేశారు. ఇది కాంగ్రెస్ కి ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి. మొత్తానికి, శనివారంతో హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచార పర్వానికి తెర పడుతుంది.