కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డికి ఓ ప్రత్యేక శైలి . తాజాగా రేషన్ కార్డులపై సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. సన్నబియ్యం అంటే చిన్న విషయం కాదు. కానీ తెలంగాణలో సన్నబియ్యం పండించడానికి ప్రోత్సాహం ఇచ్చి మరీ పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ సాధ్యం కాదని తెలియడంతో కొడాలి నాని వంటి వారితో ఆ హామీ ఎవరు ఇచ్చారని ఆయన భాషలో చెప్పించారు. అయితే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు.
సన్నబియ్యం విషయంలో వైఎస్ జగన్ ఏపీలో చేసిన వ్యవహారం నిన్నా మొన్న జరిగింది. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంతకు ముందు ఇంకా ఘోరంగా బియ్యం విషయంలో వ్యవహరించారు. వైఎస్ మొదటి సారి ఎన్నికైన తర్వాత బియ్యం మాఫియా విజృంభించింది. సన్నబియ్యం అందుబాటులో లేకుండా పోయాయి. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పంటలకు కొదవలేదు..కానీ పెద్ద ఎత్తున మిల్లర్ల దగ్గర లంచాలు తీసుకుని ఎగుమతులకు అవకాశాలు కల్పించడంతో ఇక్కడ అందుబాటులో లేకుండా పోయాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మీకు సన్నబియ్యం ఎందుకు దొడ్డు బియ్యం తినండని ఆయన ప్రజల్ని మోటివేట్ చేశారు. ఓ రోజు తాను దొడ్డు బియ్యం తిన్నానంటూ అప్పట్లో వైఎస్ ఓ వీడియో కూడా రిలీజ్ చేయించుకున్నారు.
తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ప్రజలు.. ముఖ్యంగా పేదలు కూడా సన్నబియ్యం అన్నమే తినాలని పిలుపునిస్తున్నారు. దొడ్డు బియ్యం తినాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందుకే రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టారు. శాశ్వతంగా అమలు చేస్తామని.. రైతులు కూడా సన్నబియ్యాన్నే పండించాలని అంటున్నారు. ఇప్పటికే సన్నబియ్యంకు ఐదు వందల బోనస్ ఇస్తున్నారు.
దొడ్డు బియ్యం తినమని ప్రోత్సహించిన నాటి కాంగ్రెస్ సీఎం స్థానంలో.. సన్నబియ్యాన్ని పేదలు కూడా తినాలని..వారికి రేషన్ లో అవే బియ్యం ఇచ్చే కాంగ్రెస్ సీఎం వచ్చారు. ఇది ఊహించని మార్పే అనుకోవచ్చు.