హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఇవాళ ఏసీబీ కోర్టుముందు హాజరైన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కేసీఆర్ను వదలనని, తెలుగుదేశాన్ని వీడబోనని ప్రకటించారు. మరో 25 ఏళ్ళు కొడంగల్లో తానే గెలుస్తానని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై ఎలాంటి కుట్ర పన్నిందనేది ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలుచేస్తేనే బయటపడుతుందని అన్నారు. అప్పుడు తదనుగుణంగా ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులపై కోర్టులోనే పోరాడతామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా స్పీకర్, ముఖ్యమంత్రి కలసి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీనిపై అన్నిపార్టీలను కలుపుకుని అసెంబ్లీ సమావేశాలలో నిలదీస్తామని అన్నారు. అసెంబ్లీ కార్యదర్శిగా రాజా సదారామ్ను నియమ నిబంధనలకు విరుద్ధంగా నియమించుకున్నారని, ఆయన పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారని, దీనిపై కోర్టుకు వెళతానని చెప్పారు. కేసీఆర్ను గద్దె దించేవరకు నిద్రపోనని అన్నారు. కొడంగల్లో ఉండటమనేది తనకు మంచిదేనని, తద్వారా తన ఓటర్లతో మరింత సాన్నిహిత్యం పెరిగిందని చెప్పారు. ఇటీవల తన నియోజకవర్గంలో జరిగిన ఒక ఎంపీటీసీ ఎన్నికలలో టీఆర్ఎస్పై తమపార్టీ ఘనవిజయం సాధించిందని, తన పార్టీకి వచ్చిన మెజారిటీ అంత ఓట్లుకూడా టీఆర్ఎస్కు రాలేదని పేర్కొన్నారు.