సచివాలయానికి కేసీఆర్ శాశ్వతంగా సెలవు ప్రకటించారన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. కొడంగల్ లో ఆయన మాట్లాడుతూ.. పరిపాలనను కేసీఆర్ గాలికి వదిలేయడం వల్ల అంతా చతికిలపడిపోయిందన్నారు. పాలన జరగాల్సిన సచివాలయమే కోమాలోకి వెళ్లిపోయిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన వ్యవస్థను కేసీఆర్ కుప్ప కూల్చారని ఆరోపించారు. దీంతో ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై మంత్రులు మొదలుకొని సాధారణ ప్రజల వరకూ పాలన ఎలా జరుగుతుందో తెలియని ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు రేవంత్ రెడ్డి.
ప్రజల్లో పెద్ద ఎత్తున అసహనం మొదలైందనీ, అది కోపంగా ఆవేశంగా చివరికి కక్షగా మారిందన్నారు. త్యాగాల ద్వారా సాధించిన తెలంగాణను ఆయన అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో తెరాసకు గత ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ ప్రజలు ఇచ్చారనీ, కానీ ఆ నమ్మకాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయారు. మోసమే పునాదిగా, మోసాన్నే పెట్టుబడిగా గడచిన నాలుగున్నరేళ్లు పాలించారన్నారు. ఇప్పుడా పునాదులు కదిలిపోయాయన్నారు. ఇంకోపక్క, ఇతర పార్టీల నాయకుల్ని ఫిరాయింపుల ద్వారా కొనుగోలు చేసి… ఆయా పార్టీల బలం తగ్గించే ప్రయత్నం చేశారన్నారు. అధికారం తనకు మాత్రమే శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సంస్కృతి తీసుకొచ్చారన్నారు. కానీ, ఈరోజున ఆయనకి మిగిలింది ఇలాంటి ఫిరాయింపుదారులు, కిరాయి నాయకులు, కొద్దిమంది కాంట్రాక్టర్లు మాత్రమే అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి ఆధిపత్యాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడూ క్షమించదన్నారు రేవంత్.
తాను అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ఓట్లు వస్తాయని కేసీఆర్ అనుకుంటున్నారనీ, కానీ ఎంగిలి మెతుకులకు బోల్తాపడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు రేవంత్. కేసీఆర్ నిట్టనిలువునా మోసం చేశారని బలంగా ప్రజలు నమ్మారనీ, లేదంటే కాంగ్రెస్, టీడీపీల కలయికను తెలంగాణ సమాజం ఆమోదించి ఉండేది కాదన్నారు. తెరాసను ఓడించాల్సిన ఒక ప్రత్యేక అవసరం ఈ రెండు పార్టీలనూ ఒక దగ్గరకి చేర్చిందన్నారు. సిద్ధాంతపరంగా వైరుద్ధ్యాలున్న పార్టీల కలయికను కూడా ప్రజలు ఆమోదించారంటేనే… కేసీఆర్ పట్ల ఈ సమాజంలో ఎంతటి ఏవగింపు ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ప్రజలు తెరాసను శాశ్వతంగా బొందపెట్టారన్నారు. మొత్తానికి, తెలంగాణలో ప్రజా కూటమికి ఏకపక్షంగా పట్టం కడుతున్నారనే ధీమా వ్యక్తం చేశారు రేవంత్.