తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనం అవబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జోక్యం చెప్పారు. మరొకరితో చర్చలు జరుపుతున్నారని ఆయన కూడా రెడీ అయితే అందరూ కలిసి వెళ్లి విలీనం అయిపోతారని రేవంత్ అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి సాధించిన హ్యాపీరావు నేతృత్వంలో అది జరగనుందని.. కేటీఆర్ ఆ సంగతి చూసుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.
హ్యాపీ రావు అంటే ఎంపీ సంతోష్ రావు ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి చెప్పి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇటీవల సంతోష్ రావు సన్నిహితులపై ఈడీ దాడులు జరగడంతో ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రగతి భవన్‌లోనే విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఒకరిద్దరు ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రేవంత్ ఈ విషయాన్ని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తోందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్ఎస్ ఎంపీలుపార్టీలు మారుతారన్న గుసగుసలు మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు.
గతంలో టీడీపీ ఎంపీలు కూడా ఇలాగే వెళ్లి బీజేపీలో విలీనం అయ్యారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి టీఆర్ఎస్ వస్తుందని రేవంత్ చెబుతున్నారు. ఇందులో ఎంత నిజముందో స్పష్టత లేదు కానీ నిప్పు లేనిదే పొగరాదని కొంత మంది చెబుతున్నారు. జాతీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలతో పోల్చుకుంటే.. బీజేపీనే బెటరనిఎంపీలు ఫీలైతే మాత్రం ఇది త్వరలోనే జరగొచ్చన్న అంచనాలున్నాయి.