కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తనను అరెస్ట్ చేయించేందుకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల ప్రకటనకు ముందే తనను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేశారని చెబుతున్నారు. కాంగ్రెస్ కమిటీల్లో తనకు కీలక బాధ్యతలు ఇస్తే.. ఇబ్బంది అవుతుందని కేంద్రానికి టీఆర్ఎస్ లేఖ రాసిందని… కేంద్ర సంస్థలతో దాడులు జరిపి..కట్టడి చేస్తామని.. బీజేపీ హమీ ఇచ్చిందని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ మేరకు తనకు కచ్చితమైన సమాచారం వచ్చిందంటున్నారు. ఇప్పటికే తన చుట్టూ… తన బంధువుల చుట్టూ నిఘా పెట్టారని ఆందళన వ్యక్తం చేశారు. తనకు కానీ.. తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్ ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఈడీని పంపినా… అక్రమ కేసులు పెట్టినా వదిలేదిలేదని లెక్క మిత్తితో సహా చెల్లిస్తామని కేసీఆర్ ను రేవంత్రెడ్డి హెచ్చరించారు.. కొద్ది రోజులుగా.. తెలంగాణలో కాంగ్రెస్ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. రేవంత్ కు కూడా ఓ పాత కేసులో నోటీసు వెళ్లింది. అయితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే.. అది పెద్ద రాజకీయ అంశం అవుతుంది. అందుకే.. రేవంత్ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి అరెస్ట్ చేయించబోతున్నారని అనుమానిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఆరోపణలు.. కలకలం రేపుతున్నాయి. రేవంత్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా… ఆయనకు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ పదవిని రాహుల్ గాంధీ ఇవ్వబోతున్నారని కొన్నాళ్లుగా.. కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ అంటే.. దాదాపుగా.. కాంగ్రెస్ తరపున మొత్తం చక్రం తిప్పడమే. ఇదే జరిగితే.. కేసీఆర్ కు ప్రధాన ప్రత్యర్థిగా.. కాంగ్రెస్ తరపున రేవంతే కనిపిస్తారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి రేవంత్ కు ఎలాంటి పదవి లేదు. ముఖ్యనేతల సమావేశం జరిగినప్పుడు కూడా.. ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించడానికి కూడా పీసీసీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏ హోదాతో రేవంత్ ను సమావేశానికి పిలుస్తారని కొంత మంది రచ్చ కూడా చేస్తున్నరు. ఇలాంటి సమయంలో.. ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు ఇస్తే.. రేవంత్… పార్టీలో కీలకంగా మారిపోయే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రధానమైన ఇబ్బంది నాయకత్వ లోపమే. అదే ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్ ను నియమిస్తే.. కేసీఆర్ కు ధీటైన నాయకుడిగా నిలబడగలడు. ధీటుగా సమాదానం చెప్పలగరు. ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ వైపు మొగ్గుతోందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే… టీఆర్ఎస్ కు కాస్త టఫ్ ఫైట్ రావడం ఖాయమన్న అంచనాలున్నాయి.ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి.. తనను ఈడీ లాంటి కేంద్ర సంస్థలతో అరెస్ట్ చేయించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు చేయడం… ఆసక్తికరంగా మారింది. రేవంత్ కి ఈ దిశగా .. అనుమానాలు రావడానికి.. ఇప్పటికే ఏమైనా నోటీసులు వచ్చి ఉంటాయా..? అన్న దిశగా చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. రేవంత్ ఆరోపణలు ముందు జాగ్రత్తగా చేశారా.. ? లేకపోతే నిజంగానే అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా లేదా అనేది.. కాంగ్రెస్ ఎన్నికల కమిటీలు ప్రకటించేలోపే తేలిపోనుంది.