బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది జరిగితే అది తన రాజీనామా తర్వాతనేని రేవంత్ రెడ్డి చెబుతున్నారు తాను టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… కొన్ని విషయాలపై కుండబద్దలు కొట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని వెల్లడించారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు.
తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తెలంగాణ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు ఈ సారి ప్రజలు 80 సీట్లు కట్టబెడతారని చెప్పారు. ఈ సారి కేసీఆర్ కు 25 కంటే ఎక్కువ సీట్లు రావని జోస్యం చెప్పారు. అటు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ట్రయాంగిల్ లవ్ నడుస్తోందన్నారు.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లో పొత్తులపై విస్తృత చర్చ జరుగుతోంది. మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. తర్వాత జానారెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధాన ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్తో పొత్తుల గురించి మాట్లాడటం వల్ల సీరియస్ నెస్ తగ్గుతోందని.. ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీగా భావించరని రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇటీవలి కాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. రాహుల్ గాంధీపై వేసిన అనర్హతా వేటు విషయంలో ఆ పార్టీకి మద్దతు పలికారు. దీంతో కాంగ్రెస్ నేతలు కొంత మంది బీఆర్ఎస్తో పొత్తు ఆలోచనలు చేస్తున్నారు.
బీఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదనలు ఏమైనా ఉంటే.. అది తాను రాజీనామా చేసిన తర్వాతనేనని.. రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే తాను పీసీసీ చీఫ్‌గా ఉండబోనని చెప్పినట్లయింది. ఇది ఓ రకంగా హైకమాండ్‌కు హెచ్చరికలు పంపడమేనని అటున్నారు.