బషీర్ బాగ్ కాల్పులు అనే మాట వినిపిస్తే.. అందరూ అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు వైపు చూస్తారు. ఆ స్థాయిలో ఆయనపై వ్యతిరేక ప్రచారం జరిగింది. అంత కంటే దారుణంగా ముదిగొండలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాల్పులు జరిగాయి ఎవరూ పట్టించుకోరు. కానీ.. బషీర్ బాగ్ .. వార్షికోత్సవాలు మాత్రం.. ఇక్కడ బీఆర్ఎస్.. అక్కడ వైసీపీ చేసి.. చంద్రబాబును నిందిస్తూనే ఉంటాయి.
అసలు ఆ కాల్పులకు కారణం కేసీఆర్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. అప్పట్లో ఏం జరిగిందా అని.. ఆరా తీస్తున్నారు. విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా అప్పట్లో ఉద్యమం జరిగింది. బషీర్ బాగ్ దగ్గరకు వచ్చే సరికి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు కాల్పులు జరిపారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితులు కేసీఆర్ వల్లే వచ్చాయని తాజాగా రేవంత్ రెడ్డి ఆరోపించారు.
విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజలపై కాల్పులు జరిపించింది అప్పట్లో టీడీపీలో కీలకంగా ఉన్న కేసీఆర్ అని రేవంత్రెడ్డి ఆరోపించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాల్సి ఉంటుందని నాడుచంద్రబాబు అనడానికి కారణం కేసీఆరే అన్నారు. అప్పట్లో టీడీపీలో మానవ వనరుల విభాగం (హెచ్ఆర్డీ) చైర్మన్గా ఉండి ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదని చంద్రబాబుతో చెప్పించారనన్నారు. దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా రేవంత్ ప్రదర్శించారు.
రేవంత్ వ్యాఖ్యలు ఒక్క సారిగా కలకలం రేపాయి. వెంటనే బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేశారు. రేవంత్ వ్యాఖ్యలు హాస్యస్పదంగా ఉన్నాయన్నారు. టీడీపీని గెలిపించడానికే ఇలా మాట్లాడుతున్నారంటూ ఎదురుదాడి చేశారు. రేవంత్ తాను అనని మాటల్ని..అన్నట్లుగా ట్విస్ట్ చేసి బీఆర్ఎస్ ఉద్యమాలు చేస్తే.. బషీర్ బాగ్ కాల్పుల్ని ..కేసీఆర్ కు లింక్ పెట్టి.. రేవంత్ ఇచ్చిన కౌంటర్ తో బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఇది టీడీపీ నేతలకు కూడా మంచి అస్త్రం అవుతోంది. ఇప్పటి వరకూ ఆ నిందను తిప్పికొట్టలేకపోయారు టీడీపీ నేతలు.