అల్లు అర్జున్, సంధ్య ధియేటర్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఈ ఇష్యూ ఇప్పుడు అసెంబ్లీలోనూ చర్చకు వచ్చింది. సంధ్య ధియేటర్లో ఓ మహిళ మృతి చెంది, ఓ పిల్లాడు కోమాలోకి వెళ్లిపోవడానికి కారణం అల్లు అర్జున్ కాదా? తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది అని తెలిసినా కూడా, బన్నీ పూర్తిగా సినిమా చూసే వెళ్లాడని, వెళ్తూ వెళ్తూ, చేయి ఊపుకొంటూ, ర్యాలీలా అభిమానులకు అభివాదం చేసుకొంటూ పోయాడని, మహిళ చనిపోయింన్న వార్త తెలిసి `అయితే సినిమా హిట్టు అవ్వడం ఖాయం` అని అల్లు అర్జున్ చెప్పినట్టుగా తనకు సమాచారం తెలిసిందని అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీ ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సి వచ్చింది. ‘ఈ కేసు దర్యాప్తులో ఉన్నందుకు వల్ల మాట్లాడడం సరి కాదు’ అంటూనే బన్నీపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు సీఎం. అంతే కాదు… జైలు నుంచి విడుదల అయ్యాక, బన్నీని పరామర్శించడానికి టాలీవుడ్ పెద్దలంతా బన్నీ ఇంటి ముందు క్యూ కట్టడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ”అల్లు అర్జున్‌కి కాలుపోయిందా, కన్నుపోయిందా, కిడ్నీ పాడైపోయిందా” అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. బన్నీని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ సినిమా పెద్దలు వాపోయారని, తనని కూడా తిట్టారని, ఈ పెద్దలంతా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న పిల్లాడిని పరామర్శించడానికి ఎందుకు వెళ్లలేదంటూ ప్రశ్నించారు.
మొత్తానికి బన్నీ వ్యవహారం ఇప్పట్లో తేలేది కాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో అర్థమైపోయింది. బన్నీ అరెస్ట్ అయ్యాక సైలెంట్ గా ఇంటికి వచ్చేస్తే పరిస్థితి మెల్లమెల్లగా సర్దుమణిగేదేమో. అయితే.. సినీ ప్రముఖులంతా బన్నీ ఇంటికి పరామర్శకు వెళ్లడం, దాన్ని లైవ్ టెలీకాస్ట్ చేయడం, మీడియా అంతా చూస్తుండగా హీరోలు నవ్వుకొంటూ హుషారుగా మాట్లాడుకోవడం.. చాలామందికి ఓవరాక్షన్ గా అనిపించింది. అప్పటి వరకూ బన్నీపై సానుభూతి చూపించిన వాళ్లు సైతం నెగిటీవ్ గా మాట్లాడడం మొదలెట్టారు. ఇప్పుడు సీఎం కూడా దీనిపై ప్రత్యక్షంగా స్పందించడం చూస్తుంటే… ప్రభుత్వం ఈ ఇష్యూని మరింత సీరియస్ గా తీసుకొన్నట్టు అర్థం అవుతోంది.