రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ లో గ్రామర్ మిస్సయ్యాడని బీఆర్ఎస్ నేతలు ట్రోల్ చేసుకుంటున్నారు కానీ.. రేవంత్ మాత్రం తన పని తాను పూర్తి చేసుకుని వస్తున్నారు. కేటీఆర్ ఐదేళ్ల కాలంలో వెళ్లి తెచ్చామని ప్రకటించుకున్న పెట్టుబడుల కన్నా ఎక్కువ ప్రతిపాదనలతోనే ఆయన తిరిగి వస్తున్నారు.
రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుని రేవంత్ నేతృత్వంలోని బృందం రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు ఎక్కువ. అదానీ గ్రూప్, జేఎస్ డబ్ల్యూ, వెబ్‌వర్క్స్, టాటా టెక్నాలజీస్, బీఎల్ ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హౌల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ ఫోరమ్‌లలో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్‌ను సాఫ్ట్‌వేర్‌తో సమ్మిళితం చేయాలన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపారం, స్నేహ దృక్పథానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు.
తాము తప్ప ఎవరూ ఏమీ చేయలేరని అనుకునే దగ్గరే బీఆర్ఎస్ నేతలు ఉండిపోయారు. కానీ తమకంటే అద్భుతంగా పని చేస్తున్నారని .. నిరూపించేందుకు కొత్త నేతలు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ పెట్టుబడుల ప్రతిపాదనలపై విమర్శలు చేస్తే.. కేటీఆర్ చేసినవి కూడా అవేనా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.