కేటీఆర్‌ను అరెస్టు చేయడం ఖాయమన్నట్లుగా మంత్రి పొంగులేటి పొగబాంబులేశారు. ఆయనను ప్రశ్నించడానికి గవర్నర్ అనుమతి కోసం ఏసీబీ లేఖ రాసింది. తనను అరెస్టు చేయడం ఖాయమని కేటీఆర్ కూడా రోజూ ఓ సారి జైలుకెళ్లడానికి సిద్దమని ప్రకటిస్తూ వచ్చారు. మూడు నెలలు యోగా చేసుకుని పాదయాత్ర ప్రారంభిస్తానని బెదిరించేలా మాట్లాడారు కూడా. అయితే గవర్నర్ నుంచి పర్మిషన్ రాలేదు. కేటీఆర్ కూడా ఢిల్లీ వెళ్లొచ్చిన సైలెంటుగా ఉండిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆయనను అరెస్టు చేయడంపై కామెడీగా మాట్లాడారు.
జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లంతా సీఎంలు అవుతున్నారని తాను కూడా సీఎం అవుతానని భావించేందుకు జైలుకు వెళ్లేందుకు ఉబలాటపడుతున్నారని రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. అలాంటి అవకాశం ఉంటే ముందుగా కవిత సీఎం అవుతారు కదా .. ఆ అవకాశం కూడా ఆయనకు లేదని తేల్చేశారు. కేటీఆర్ ఆ ఉద్దేశంతో అరెస్టు అవడానికి సిద్ధమయ్యారా లేదా అన్న విషయం పక్కన పెడితే బయటపడిన అవినీతి వ్యవహారాల్లోనూ చర్యలు తీసుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోందని మాత్రం అనుకోవచ్చు.
ఫార్ములా ఈ రేసు విషయంలో లెక్కాపత్రం లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు దేశం దాటిపోయాయి. తామే ఇచ్చామని లకేటీఆర్ చెబుతున్నారు. అలా ఇచ్చినదానికి పత్రాలేవి అని ప్రభుత్వం ఆయనను వివరణ అడగాల్సింది. కానీ అడగడం లేదు. ఇతర అవినీతి కేసుల్లోనూ విచారణలు ఏడాదిగా సాగుతున్నాయి. ట్యాపింగ్ కేసు ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఈ కేసులోనూ కేటీఆరే కీలక నిందితులని కాంగ్రెస్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఎన్ని చెప్పినా కేటీఆర్ అరెస్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గినట్లే అనుకోవచ్చు.