కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఈ మధ్య మీడియాలో పెద్దగా కనిపించడం లేదు! పార్టీలో చేరిన కొత్తగా కేసీఆర్ పై దాడి అంటూ వరుసగా కొన్ని అంశాలను లేవనెత్తారు. పోరాటమన్నారు. ఆ తరువాత, వాటి ఊసే ఎత్తడం లేదు. టీడీపీ వర్కింగ్ కమిటీ ప్రెసెడెంట్ హోదాలో ఉండగానే ఆయన కాంగ్రెస్ కి వచ్చారు. దీంతో ఇక్కడ కూడా ఆయనకి కీలక స్థానం ఉంటుందనుకున్నారు. ఆయన సేవల్ని పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని రాహుల్ గాంధీ కూడా అప్పట్లో చెప్పారు. దీంతో రేవంత్ కి కీలక పదవే దక్కుతుందని అందరూ ఊహించారు. కానీ, ఆ అంశం నాన్చుడే అన్నట్టుగా పక్కకు వెళ్లింది.
ఇక, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న బస్సుయాత్రలో ఆయన కనిపిస్తున్నా… దాదాపు ఓ అరడజను నాయకులు మాట్లాడిన తరువాత రేవంత్ కి మైక్ ఇస్తున్నారు. ఎందుకలా అంటే… ముందే రేవంత్ మాట్లాడేస్తే జనం వెళ్లిపోతారు కదా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సభల్లో చిట్ట చివరకి రేవంత్ మాట్లాడే సమయం వచ్చేసరికి జనం పల్చబడుతున్న సందర్భాలున్నాయి. అంతేకాదు… రేవంత్ కి ఉన్న క్రేజ్ తో ఇతర కాంగ్రెస్ నేతలు కూడా వారి నియోజక వర్గాలకు రేవంత్ ను తీసుకెళ్లి సభలు నిర్వహిస్తున్నారు. అయితే, ఇలా వెంటపడి మరీ రేవంత్ ని సభలకి రమ్మంటూ ఆహ్వానిస్తే… పీసీసీ అధ్యక్షుడు ఏమనుకుంటారో అని అనుకునే వర్గమూ ఒకటుందట!
నిజానికి, కాంగ్రెస్ లో చేరగానే పాదయాత్ర ఉంటుందని రేవంత్ అనుకున్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని భావించారు. కానీ, ఆయన అనుకున్నట్టుగా ఇప్పుడు జరగడం లేదు. ఎవరో పిలిస్తే వెళ్లడం, మాట్లాడమంటే మాట్లాడటం అన్నట్టుగా తయారైంది. దీంతో రేవంత్ కాస్త అసంతృప్తిగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీని ఉరకలెత్తిస్తూ పరుగులు తీయించాల్సిన ఈ సమయంలో… నత్త నడక యాత్రలు, సభలూ ఉంటున్నాయనేది రేవంత్ అంతరంగంగా తెలుస్తోంది. పార్టీ తరఫున సరైన కార్యక్రమాలు జరగడం లేదన్న భావన ఆయనలో ఉన్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలన్నీ చర్చించేందుకు త్వరలోనే రేవంత్ ఢిల్లీ వెళ్లబోతున్నారనీ, రాహుల్ గాంధీతో చర్చించబోతున్నారని సమాచారం. కనీసం ఈ భేటీ తరువాతైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటనేది స్పష్టమౌతుందని చెప్పొచ్చు.