తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి అంటేనే హడావుడి ఉంటుంది. ఆయన తనకు బాధ్యతలిచ్చినా ఇవ్వకపోయినా చొరవగా పార్టీ కోసం పనిచేయడానికి దూకుడుగా వెళ్తూంటారు. ఇప్పటి వరకూ దుబ్బాక సహా అన్ని రకాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ కోసం చురుకుగా పోరాడారు. గ్రేటర్ ఎన్నికల్లో… ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నీ తానై ప్రచారం చేశారు. ఇతర పార్టీ సీనియర్లెవరూ కన్నెత్తి చూడకపోయినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎఎన్నిక ఊపు వచ్చే సరికి రేవంత్ సైలెటయ్యారు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు.
వారం రోజుల కిందట రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో ఆయనను కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇక ఆయనను సాగర్ ఎన్నికల్లో ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. రేపోమాపో నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా… రేవంత్ చొరవ తీసుకుని సాగర్ వెళ్లి ప్రచారం చేయడమే కానీ… ఉత్తమ్ కానీ… జానారెడ్డి కానీ తన నియోజకవర్గానికి వచ్చి ప్రచారం చేయాలని పిలిచే అవకాశం ఉండదు.
నాగార్జున సాగర్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోటీ ఉంది. రాజకీయ సమీకరణాల రీత్యా.. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి అడ్వాంటేజ్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే… ఆయనకు ఉన్న మాస్ ఇమేజ్ కారణంగా పెద్ద ఎత్తున జనం వస్తారని.. తర్వాత గెలుపు క్రెడిట్ ఆయనకే వెళ్తుందని… కాంగ్రెస్‌లోనే కొంత మంది భావిస్తున్నారు. సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ మార్పు ఉంటుంది. అందుకే.. రేవంత్ రెడ్డి పాత్ర వీలైనంత తక్కువ ఉండేలా చూడాలని కాంగ్రెస్ సీనియర్లు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
ఇటీవలి కాలంలో రేవంత్ రెడ్డి అనుచరులుగా పేరున్న వారు.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరిపోగా… కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా అదే బాట పట్టారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నదానిపై క్లారిటీ లేదు. మొత్తానికి రేవంత్ తన రాజకీయ భవిష్యత్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న చర్చ…. ఆయన అనుచరుల్లో వినిపిస్తోంది.