కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు మీద, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై ఒకే అంశంతో పోరాటానికి సిద్ధమని పిలుపిచ్చారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల హక్కుల కోసం పోరాటం చేస్తామన్నారు. రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రతో వ్యవహరిస్తున్నాయంటూ ధర్నాలో నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి ప్రత్యక్షంగా నరేంద్ర మోడీ, పరోక్షం కేసీఆర్ జట్టుకట్టి ప్రయత్నిస్తున్నారన్నారు. దళిత గిరిజన మైనారిటీ మహిళలు బలహీన వర్గాల వెన్నువిరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వర్గాల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందనీ, అందుకే ఇప్పుడు దండయాత్రకు సిద్ధమయ్యామన్నారు రేవంత్. తెలంగాణలో దళితుల రిజర్వేషన్లు రెండు శాతం తక్కువగా ఉన్నాయనీ, విద్య ఉద్యోగాలు పదవుల అవకాశాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా గిరిజన సోదరులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారన్నారు. ఇది పూర్తిగా గిరిజన వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలకు రిజర్వేషన్లు ఉండాలనీ, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం సోనియా నాయకత్వంలో రాజ్యసభ ఆమోదించినా… లోక్ సభలో మోడీ ప్రభుత్వం అడ్డుపడుతోందన్నారు. మోడీని అడ్డు తొలగించుకోవాల్సిన బాధ్యత ఆడబిడ్డల చేతిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వాస్తవానికి, ఈ అంశంపై కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పోరాటం చేయగలిగితే జాతీయ స్థాయితో ఆ పార్టీకి ఇది మంచి అవకాశమే. ఎందుకంటే, కాంగ్రెస్ మొదట్నుంచీ దళితులు, అణగారిన వర్గాలకు చేరువగా ఉండే పార్టీగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. అయితే, ఈ మధ్య ఆ పట్టు కూడా కోల్పోయిందా అనే పరిస్థితి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ అంశంపై ఉద్యమాలు చేస్తామని నేతలు అంటున్నారు. కానీ, ఆ ఉద్యమాలను చిత్తశుద్ధితో రాష్ట్ర స్థాయి నుంచి నిర్మించ గలిగితే… రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులకు మళ్లీ కొంత ఉత్సాహం వస్తుంది, జాతీయ స్థాయిలోనూ కేంద్రంపై బలంగా పోరాడే ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ నిలబడగలదు అనే సందేశం ఇచ్చుకున్నట్టూ అవుతుంది.