అమ్మో.. తెలంగాణ కూడా ఏపీలా అయిపోతుందా ?. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించిన తర్వాత తెలంగాణలోని ఓ వర్గం ప్రజల్లో ఎక్కువగా వచ్చిన సందేహం ఇది. ఇక్కడ ఏపీలా అవడం అంటే.. కక్ష సాధింపులు.. రాష్ట్ర నాశనం. ఓ వర్గాన్ని టార్గెట్ చేుసకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తే ఆ వర్గం కూడా నాశనం అయిపోతుందన్నట్లుగా పాలన చేస్తున్నారు. ఇక్కడా రేవంత్ అదే చేస్తారనుకున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఎదుర్కొన్న వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఆయనపై నిరంతరం నిఘా ఉండేది. ఓటుకు నోటు లాంటి కేసులో పది కెమెరాలను ఫిక్స్ చేసి మరీ ఆయనను ఇరికించారంటే… ఎంత పెద్ద కుట్ర జరిగిందో చెప్పాల్సిన పని లేదు.
అప్పట్నుంచి ఆయన పడిన ఇబ్బందులు ఏ రాజకీయ నాయకుడు పడి ఉండడు. అవన్నీ గుర్తు పెట్టుకుంటే.. కసి తీర్చుకోవాలని అనుకుంటారు. ప్రలు కూడా అదే అనుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆవేశంగా చేసిన ప్రకటనలు చూస్తే ఎవరైనా అదే అనుకుంటారు.. కానీ రేవంత్ రెడ్డి అలాంటి ఆవేశం కనిపించడం లేదు, ప్రతిపక్ష నేతగా ఏం చేసినా సరే.. తాను ఇప్పుడు అధికార పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న సీఎంను కాబట్టి.. వారి గౌరవానికి భంగం లేకుండా పాలన చేయాలనుకుంటున్నారు. అందుకే ఎలాంటి కక్ష సాధింపుల ప్రయత్నాలూ చేయడం లేదు. చివరికి కేసీఆర్ ఏరికోరి నియమించుకున్న అధికారుల్ని కూడా బదిలీ చేయడం లేదు. సీఎస్‌గా శాంతికుమారినే కొనసాగిస్తున్నారు.
డీజీపీగా ఈసీ నియమించిన రవిగుప్తానే కొనసాగుతున్నారు. అసెంబ్లీలోనూ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు.. ఆయనపై గౌరవాన్ని పెంచుతోంది. ఆయనలో ఆవేశం పూర్తిగా తగ్గిందని.. సీఎం పదవితో పాటే ఆలోచన వచ్చిందని రాజకీయవర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. అసెంబ్లీని నడిపించిన విధానంపైనా గతంలో కేసీఆర్ వ్యవహరించిన తీరుతో పోల్చి…ప్రశంసలు కురిపిస్తున్నారు.