తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమస్యలేమిటో గుర్తిస్తున్నారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అంచనాకు వస్తున్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన ఆ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేలతో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల పది మంది ఎమ్మెల్యేలు గ్రూపుగా సమావేశం అయ్యారు. తమ పనులు అవడం లేదని.. పట్టించుకునేవారు లేరని వారి ఆవేదన.
నేరుగా ఎమ్మెల్యేలతో తానే టచ్ లో ఉండాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాగూ కలిసే ఎమ్మెల్యేలు కలుస్తారు. వారు చెప్పాలనుకున్న విషయాలు చెబుతారు. కానీ అలా అయితే పూర్తిగా తమ మనసులో మాట బయట పెట్టరన్న అభిప్రాయంతో రేవంత్ రెడ్డి వినూత్నమైన ఆలోచన చేశారు. మార్చి ఆరో తేదీ నుంచి ఆయన ఎమ్మెల్యేలతో లంచ్ మీటింగ్స్ ప్లాన్ చేసుకున్నారు. అన్ని విషయాలను సమగ్రంగా మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు.
అలాగే నియోజకవర్గాలకు అవసరమైన నిధుల వినియోగం విషయంలోనూ ఎమ్మెల్యేలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మంత్రులకు ఎక్కువగా నిధులు అందుబాటులో ఉంటున్నాయని తమకు అంత ఉండటం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు. అయితే ఇదంతా అపోహ మాత్రమేనని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకే నిధుల కేటాయింపులో మరింత పారదర్శకత ఉండేలా చూస్తానంటున్నారు. ఎమ్మెల్యేలకు తమను పట్టించుకోవడంలేదని లేదన్న అభిప్రాయం వల్లనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. దీన్ని గుర్తించిన రేవంత్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.