సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి చాలా సార్లు ప్రయత్నించానని సాధ్యం కాలేదని ఐదు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన గుమ్మడి నర్సయ్య ఆవేదన చెందడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సీఎం ఇంటి వద్ద ఆయన ఎదురు చూసినా ప్రయోజనం లేకపోయింది. అపాయింట్ మెంట్ లేకుండా అలా నేరుగా వెళ్లడం వల్ల కలవలేకపోవచ్చు కానీ.. ఇలాంటి గౌరవప్రదమైన వ్యక్తులు కలిసేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన టీం అసలు నిర్లక్ష్యం చేయకూడదు. కానీ చేశారు. చాలా సార్లు ప్రయత్నించినా ఆయనకు అవకాశం దక్కలేదు.
తెలంగాణ రాజకీయాల్లో గుమ్మడి నర్సయ్య సామాన్యమైన వ్యక్తే కావొచ్చు కానీ.. ఈ రోజుల్లో ఏ రాజకీయ నేత కూడా పాటించలేనన్ని విలువలు పాటిస్తారు. ఐదుసార్లు ఎమ్మెల్యే అయినా రూపాయి సంపాదించుకోలేదు. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చె పేన్షన్ లో సగానికిపైగా పార్టీకి ఇచ్చేస్తారు. మిగిలే కొద్ది మొత్తంలోనే బతుకుతున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసి సంపాదించుకోకపోవడం ఆయన తప్పు అన్నట్లుగా ప్రస్తుత రాజకీయం ప్రవర్తించకూడదు. కానీ దురదృష్టవశాత్తూ అలాగే జరుగుతోంది.
తనను కలవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో అన్న విషయం రేవంత్ రెడ్డికి తెలియకపోవచ్చు. ఆయన ఎమ్మెల్యే కాదు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం అపాయింట్ మెంట్లు చూసే వ్యక్తులు అనుకుని ఉండవచ్చు. కానీ తప్పు మాత్రం జరిగింది. దాన్ని మీడియాలో.. సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవడానికి ఇతర పార్టీలు రెడీగా ఉంటాయి. వాటి డ్యూటీ అవి చేస్తున్నాయి. ఎందుకంటే.. రేవంత్ రెడ్డి టీం చేయాల్సిన పని చేయలేదుకాబట్టి. ఈ విషయం గుమ్మడి నర్సయ్యకు ప్రత్యేక గౌరవం ఇచ్చి ఆయన సీఎం దృష్టికి తీసుకు రావాలనుకున్న ప్రజాసమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరిస్తే కొంత వరకూ ఆయనను గౌరవించినట్లవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.