తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను గెలుచుకొని ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్న బీజేపీకి ఆదిలోనే బ్రేకులు వేయాలని సీఎం రేవంత్ ఫిక్స్ అయ్యారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ అసెంబ్లీలో కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు రెడీ అయ్యారు. అయితే ఇదేదో ఇప్పటికిప్పుడు బీజేపీని డిఫెన్స్ లో పడేసేందుకు రూపొందించిన ప్రణాళిక కాదు..భవిష్యత్ లో దాని ఫలితాలు పొందాలనే వ్యూహంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మరికొద్ది నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ..అదే ఊపులో గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది.పైగా ఈసారి బీజేపీకి జనసేన, టీడీపీ కూడా తోడయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే గ్రేటర్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితి తప్పదు. అందుకే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ వైఖరిని ఖండిస్తూ..అసెంబ్లీలో చర్చ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read : వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఉన్నట్టా..? లేనట్టా..?
మూసీ బ్యూటీఫికేషన్, ఐటీఐఆర్, ఐఐఎం వంటి ప్రాజెక్టులకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడమే కాకుండా.. తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసిందని అసెంబ్లీ ద్వారా ప్రజలకు రేవంత్ వివరించనున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్ ను భాగస్వామ్యం చేయడం కూడా రేవంత్ ఎత్తుగడగా కనిపిస్తోంది.
గ్రేటర్ ఎన్నికల నాటికి బీజేపీతో బీఆర్ఎస్ జత కట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు బడ్జెట్ విషయంలో బీఆర్ఎస్ వైఖరిని స్పష్టంగా ప్రకటిస్తే..ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు వెళ్తే బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ కు ఈజీ అవుతుంది. అదే సమయంలో బీజేపీ తీరును ఎండగట్టినట్టు అవుతుంది. మొత్తంగా అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై చర్చ పెట్టాలనుకున్న రేవంత్ నిర్ణయం వెనక ద్విముఖ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.