తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్‌ను ఢీకొడుతున్నారు. కొడంగల్‌లో నాలుగో తేదీన కేసీఆర్ బహిరంగసభను.. టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. కేసీఆర్ కొడంగల్ రాకను.. తనకు అనుకూలంగా మల్చుకునేందుకు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ స్టైల్లో రాజకీయాలు చేయడం ప్రారంభించారు. కొడంగల్‌లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని.. ఇక ముందు చేస్తామని కేసీఆర్ హామీలు ఇచ్చే అవకాశం ఉన్నందున… రేవంత్ మరింత వ్యూహాత్మకంగా… కొడంగల్‌కు కేసీఆర్ అన్యాయం చేశారనే వాదన తెరపైకి తీసుకు వచ్చారు. నారాయణపేట ప్రాజెక్ట్ మంజూరైన కట్టకపోవడాన్ని… సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం తరపున ఎలాంటి కార్యాచరణ లేకపోవడాన్ని హైలెట్ చేసుకుంటున్నారు. మామూలుగా విమర్శిస్తే… వేడి ఎలా పెరుగుతుందనుకున్నారేమో కానీ.. ఏకంగా కేసీఆర్‌ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. బంద్ చేస్తామని ప్రకటింటారు.
రేవంత్ రెడ్డి దూకుడుతో టీఆర్ఎస్ ఉలిక్కి పడింది. రేవంత్ రెడ్డి ఎన్నిల వ్యూహాలు అంతు చిక్కని విధంగా ఉండటంతో..ఎందుకైనా మంచిదని.. ఈసీకీ ఫిర్యాదు చేశారు. ఈసీ కూడా.. రేవంత్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని డీజీపీని ప్రశ్నించారు. దీంతో పోలీసులు కూడా కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాలుగో తేదీన కేసీఆర్ సభ ఉన్నందున 144వ సెక్షన్ పెట్టారు. భారీగా పోలీసు బందోబస్తు పెట్టారు. కచ్చితంగా ఇలాంటి పరిస్థితినే రేవంత్ రెడ్డి ఆశించారు. కేసీఆర్ కొడంగల్‌కు అన్యాయం చేశారని.. ప్రజలు ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతోనే.. ఆయన పోలీసుల్ని మోహరింపచేశారన్న భావన పెంచడానికి రేవంత్ చేసిన ప్రయత్నాలు ఇలా సక్సెస్ అవుతున్నాయి.
కొడంగల్ లో… రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది. దాదాపుగా.. ఏడాది నుంచి .. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు… పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్‌లోనే మకాం వేసి… గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఖర్చుకు వెనుకాడటం లేదన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఆరోపణల ప్రకారం రూ. వంద కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారు. దాని ప్రకారమే.. కొడంగల్ గ్రామాల్లో మద్యం, డబ్బుల పంపిణీ జరుగుతోంది. దీన్ని ఎదుర్కోవడానికే.. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా .. కొడంగల్‌కు కేసీఆర్ అన్యాయం చేశారనే వాదనను తెరపైకి తెస్తున్నారు. రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తూండటంతో.. ఇది ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. ఫలితంగా రేవంత్ అనుకున్న ఎఫెక్ట్ తెచ్చుకోగలుగుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.