ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో జరిగిన నిధుల గోల్ మాల్ విషయంలో కేటీఆర్ పై నమోదైన కేసు విషయంలో ఆయన రిలీఫ్ పొందారు. పది రోజుల పాటు అరెస్టు నుంచి ఆయన రక్షణ పొందారు. ఇప్పటి వరకూ ఇలాంటి కేసుల్లో ఓ సారి ఇలా పరిమితంగా అయినా రిలీఫ్ పొందిన తర్వాత అరెస్టు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు తక్కువ. అందుకే ఈ కేసులో కేటీఆర్ ను అరెస్టు చేయకుండా విచారించే పరిస్థితే దాదాపుగా ఉండవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా అంత పట్టుదలగా లేదని సులువుగానే అర్థమవుతుంది.
కేటీఆర్ ను అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో ఆరు నెలల కిందటే పూర్తి చేసేవారు. అయితే దాని వల్ల ఒరిగేదేంటి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అరెస్టులు చేయడం వల్ల రాజకీయంగా ఆయనకు సానుభూతి వస్తుంది తప్ప .. దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఇప్పటి వరకూ జరిగిన రాజకీయాలతో ఎవరికైనా అర్థం అవుతుంది. అదే కక్ష సాధింపులు అనే భావన ప్రజలకు రాకుండా న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్న తర్వాత అరెస్టు చేస్తే ప్రజలు కూడా కన్వీన్స్ అవుతారు. అప్పుడు జైలుకెళ్లే వ్యక్తికి సానుభూతి కూడా రాకపోవచ్చు.
కేటీఆర్ విషయంలో అయినా రేపు కేసీఆర్ విషయంలో అయినా ఇదే పద్దతిని రేవంత్ ప్రభుత్వం పాటించే అవకాశాలు ఉన్నాయి. తనను ఎన్నో సార్లు అరెస్టు చేశారని అదే కక్షతో అరెస్టు చేయవచ్చు కానీ రేవంత్ రెడ్డి ముందుచూపుతో రాజకీయాలు చేస్తారు. రేపు వారు రాజకీయంగా ఇంకా బలహీనపడితే మాత్రం.. ఎలాంటి శషభిషలు పెట్టుకోకుండా తాను అనుకున్నది చేయడానికి రేవంత్ రెడ్డి వెనుకాడకపోవచ్చు.