తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడటం, కాంగ్రెస్ కండువా కప్పుకోవడం లాంటి లాంఛనాలన్నీ పూర్తైపోయాయి. ఇంకేం, కాంగ్రెస్ తరఫున ఆయన తెరాసపై యుద్ధం ప్రకటించేసినట్టే..! ఇక, తెరాస ఆగుతుందా… రేవంత్ కాంగ్రెస్ లో చేరేంత వరకూ ఈ వ్యవహారంపై తెరాస నేతలు నోరెత్తలేదు. ఏ తరహా వ్యాఖ్య చేసినా రేవంత్ కు ప్రాధాన్యత పెరిగిపోతుందేమో అన్నట్టుగా, ఆయన పార్టీ మార్పు ఒక సాదాసీదా వ్యవహారం అనే తరహాలోనే చూస్తూ వచ్చారు. తీరా పార్టీలో చేరాక మంత్రి కేటీఆర్ స్పందించారు. కుంభకోణాల కాంగ్రెస్ లోకి మరో దొంగ రేవంత్ రెడ్డి చేరారు అంటూ ఆయన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రైఫిల్ రెడ్డి పిట్టలదొరగా మారిపోయారంటూ కేటీఆర్ ఎద్దేవా చేసిన సంగతీ తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యానాలపై రేవంత్ రెడ్డి ఊరకుంటారా చెప్పండీ..? కేటీఆర్ కామెంట్లపై స్పందిస్తూ… ఓం ప్రథమం అంటూ తెరాసపై మాటల యుద్ధాన్ని ఈయనా మొదలుపెట్టేశారు.
తన ఫేస్ బుక్ అకౌంట్లో రేవంత్ రెడ్డి ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం అనే ఓ శీర్షిక పెట్టి.. పక్కా మీడియా స్టైల్లో ఒక కథనం రాసి, దానికో ఫొటో కూడా పెట్టి ఆన్ లైన్ లోకి వదిలేశారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే… మంత్రి కేటీఆర్, సత్యం రామలింగరాజు తనయుడు తేజా రాజుతోపాటు మలేషియా ప్రధానితో కలిసి ఇచ్చిన స్టిల్ ఉంది. రామలింగరాజు కుమారుడితో కలిసి, స్కామ్ స్టార్ కేటీఆర్ జరిపిన మంతనాలు ఇవిగో అంటూ రేవంత్ ఘాటుగా స్పందించారు. ముందుంది క్రొకొడైల్ ఫెస్టివల్ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వేల కోట్ల రూపాయల కుంభకోణంతో సంబంధం ఉన్న రామలింగరాజు కొడుకుతో మంత్రి కేటీఆర్ విదేశాల్లో ఏం చేశారనీ, 2016 జులైలో జరిగిన ఈ భేటీకి పరమార్థం ఏంటంటూ రేవంత్ ప్రశ్నించారు. కుంభకోణాలకు పాల్పడింది ఎవరు అనేది అన్నీ బయటకి వస్తాయంటూ ఎద్దేవా చేశారు. దొంగలు ఎవరో తెలంగాణ సమాజం గుర్తించే రోజు దగ్గర్లో ఉందన్నారు.
మొత్తానికి, కాంగ్రెస్ లో చేరిన వెంటనే మంత్రి కేటీఆర్ విమర్శలపై ఘాటుగానే స్పందించారు. ఈ ఫొటోకి సంబంధించి కేటీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. ఇక, తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులపాటు ఈ మాటల దాడుల ఉంటాయనే అనిపిస్తోంది. పార్టీలోకి మారిన తరువాత తన వాడీవేడీ ఏంటనేది చూపించుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి కి ఉంటుంది కదా! తెలుగుదేశం పార్టీలో ఉండగా చేయలేని ఆ పోరాటమేదో, తెరాసపై ప్రయోగించలేని ఆ అస్త్రాలేవో ఒక్కోటిగా ఇప్పుడు బయటకి తీయాలి కదా! దాన్లో భాగంగానే మంత్రి కేటీఆర్ కు సంబంధించి ఈ ఫొటోని సోషల్ మీడియాలోకి తెచ్చారు. దీనిపై తెరాస నేతలు ఇంకేదో అంటారు, వాటిపై రేవంత్ మరేదో అంటారు. తెరాసకూ కాంగ్రెస్ కూ మధ్య కొన్నాళ్లు ఈ మాటల యుద్ధాలు తప్పేట్టు లేవు. ఈ విధంగా తెరాసపై రేవంత్ పోరాటం షురూ అయిందన్నమాట!