కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక మద్దతుదారునిగా ఉన్న కూన శ్రీశైలంగౌడ్ … బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవడంతో కూన శ్రీశైలం గౌడ్ కీలక పాత్ర పోషించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తేవడంలో ఆయనది ముఖ్యపాత్ర. అందుకే రేవంత్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడల్లా కూన శ్రీశైలం గౌడ్‌ను పొగుడుతూ ఉంటారు. అయితే… ఇప్పుడు కాంగ్రెస్‌లో పరిస్థితుల పట్ల కూన శ్రీశైలం గౌడ్ అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ ఇస్తారో లేదో తెలియదు.. ఇచ్చినా ఆయనను పని చేయనిస్తారో లేదో తెలియదన్నట్లుగా పరిస్థితి మారడంతో తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
కొంత కాలంగా కాంగ్రెస్‌లో కీలక నేతలపై బీజేపీ కన్నేసింది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పని చేసిన డీకే అరుణ .. పలువురు నేతలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఇప్పుడు.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని .. ఇక కాంగ్రెస్‌కు చాన్స్ లేదన్న అభిప్రాయాన్ని కల్పించడంలో కొంత వరకూ సక్సెస్ అవుతున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డి లాంటి ఇమేజ్ ఉన్న నేత ఎదురుగా కనిపిస్తున్నా.. కాదనుకుని బీజేపీ వైపు చూస్తున్నారు. వీరిని ఆపేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు.
కాంగ్రెస్‌లో ఆయననే గుర్తించడం లేదని… తమనేం గుర్తిస్తారన్న అభిప్రాయం.. ఇతర నేతలు వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ హైకమాండ్ పూర్తిగా వెనుకబడిపోవడం కాంగ్రెస్ క్యాడర్ని నిరాశ పరుస్తోంది. కూన శ్రీశైలం గౌడ్ తో పాటు మరికొంత మంది నేతలతోనూ డీకే అరుణ చర్చలు జరుపుతున్నారు. ఓ సారి టీ పీసీసీ పార్టీ పదవులు ప్రకటించిన తర్వాత… పరిస్థితి మొత్తం ఓ క్లారిటీకి వస్తుందని అంచనా వేస్తున్నారు.