తమ పథకాలు, పాలన చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా తాము కావాలని కోరుకుంటున్నామని చెప్పుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నం రివర్స్ అయినట్లుగా కనిపిస్తోంది. రెండు రాష్ట్రాలను కలిపేయడమే కేసీఆర్ మాటలకు సింపుల్ పరిష్కారం అని మంత్రి పేర్ని నాని ప్రకటించడంతో వెంటనే టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కేసీఆర్ ఆషామాషీగా ఆ వ్యాఖ్యలు చేయలేదని.. వ్యూహాత్మకంగానే అంటున్నారని.. తెలంగాణను బలిపీఠం ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించడం ప్రారంభించారు. ఇటీవల టీఆర్ఎస్ నిర్వహించిన ప్లీనరీలో తెలంగాణ తల్లికి బదులు తెలుగు తల్లి ఫోటోలు పెట్టారు. దీన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ జోలికొస్తే సహించబోమని రేవంత్ అంటున్నారు.
ఈ వివాదం మొల్లగా సమైక్య రాష్ట్రం దిశగా సాగుతూడంటం.. దీనికి మూలం కేసీఆర్ కావడంతో రాజకీయం మరింత జోరుగా సాగే అవకాశం ఉంటుంది. తెలంగాణ అనే మాటతోనే ఉద్యమం రేపి.. అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ ఇప్పుడు.. ఏపీలోనూ టీఆర్ఎస్ పార్టీ అంటూ చేస్తున్న ప్రకటనలతో .. ఆయన తెలంగాణ వాదంలోని స్వచ్చతపైనే అనుమానాలు ప్రారంభమయ్యే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని పక్కాగా ఉపయోగించుకుంటున్నారు.
కేసీఆర్ ఏపీలో పార్టీ పెడతారో లేదో ఎవరికీ తెలియదు. పెట్టేంత సాహసం చేస్తారని కూడా అనుకోవడం లేదు. కానీ తమ రాష్ట్ర ప్రజలను మెప్పించడానికి.. తమ పాలన పొరుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఆకట్టుకుంటోందని చెప్పడానికి మాత్రమే ఆయన ఈ మాటలను వాడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అది రివర్స్ అవుతోంది. దీనికి కౌంటర్ ఇచ్చి … అలాంటిదేమీ లేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్పై పడుతోంది. ఎంత ఆలస్యం చేస్తే అంత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.