తెలంగాణ విషయంలో ఇచ్చింది..తెచ్చింది తామేనని గట్టిగా నమ్ముతున్న రేవంత్ రెడ్డి…. ఈ విషయంలో తమ ఘనతేనని క్లెయిమ్ చేసుకుంటున్న కేసీఆర్ ముద్రల్ని తుడిచేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత పాలనలోని రాచరిక పోకడలను తుడిచేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో కేసీఆర్ కుటుంబసభ్యుల పోలికలు ఉన్నాయని గతంలోనే విమర్శలు వచ్చాయి. అందుకే ఇప్పుడు విగ్రహాన్ని మార్చేస్తున్నారు.
వాహన రిజిస్ట్రేషన్ల కోసం గతంలో కేంద్రం ప్రకటించిన గెజిట్ ప్రకారం ఇకపై ‘టీజీ’ పేరుతో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కేంద్ర గెజిట్ను ఉల్లంఘిస్తూ గత ప్రభుత్వం ‘టీఎస్’ పేరుతో రిజిస్ట్రేషన్లు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. టీఆర్ఎస్ ను పోలి ఉండేలా టీఎస్ అనే పేరును ఖరారు చేశారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు., ఇక రాష్ట్ర అధికారిక గీతంగా ప్రముఖ కవి అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గేయాన్ని ప్రకటించారు.
కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం టీఆర్ఎస్ పేరులో తెలంగాణను తీసేశారు. రేవంత్ రెడ్డి మరింత వ్యూహాత్మకంగా… తెలంగాణలోనే కేసీఆర్ ముద్రల్ని లేకుండా చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ భవిష్యత్ మరింత గందరగోళంగా మారే అవకాశం ఉండటంతో… ఉద్యమనాయకుడిగా కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ అంతా.. పలుచన అయ్యేలా చేసేందుకు రేవంత్ పకడ్బందీ ప్రణాళికలతో ముందుకెళ్లే అవకాశం ఉంది.