తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. నిన్నటి వరకూ పట్నం గోస పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ఆ కార్యక్రమం నడుస్తున్న సమయంలోనే గోపన్ పల్లిలోని ఆయన భూములు కబ్జా చేశారంటూ..కొన్ని మీడియా సంస్థలు రచ్చ రచ్చ చేశాయి. దీన్ని చూసి.. ఏ మాత్రం వెనక్కి తగ్గని రేవంత్… సోమవారం సంచలన విషయం బయటపెడతానని.. మూడు గంటలకు తన ఇంటి వద్ద ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ప్రముఖ చానళ్లు, పత్రికల ప్రతినిధులందరూ సమయానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ.. రేవంత్ వ్యూహాత్మకంగా అక్కడేమీ మాట్లాడలేదు. కానీ.. అందర్నీ తీసుకుని… వేరే ప్రాంతానికి బయలుదేరారు. జన్వాడ అనే గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ ఫామ్‌హౌస్ ముందు పెద్ద ఎత్తున పోలీసులు అప్పటికే మోహరించారు.
రేవంత్ తో పాటు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అక్కడికి చేరుకోగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంతకీ ఆ ఫామ్‌హౌస్ ఎవరిది..? అంటే… కేటీఆర్‌దని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. జన్వాడ అనే గ్రామంలో కేటీఆర్ పాతిక ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని అంటున్నారు. ఫామ్‌హౌస్ కట్టుకోవడం నేరం కాదు.. కానీ.. జన్వాడ గ్రామం జీవో నెం 111 పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ దాహార్తి తీర్చే జంట జలాశయాలకు.. నీరు చేరే మార్గం మూసిపోకుండా… గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. వాటి పరిధిలోని గ్రామాల్లో శాశ్వత నిర్మాణాలపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ.. జీవో నెం 111 విడుదల చేశారు. ఆ జీవో నిబంధనలు ఉల్లంఘిస్తూ… కేటీఆర్ ఫామ్‌హౌస్ కట్టారని.. రేవంత్ ఆరోపిస్తున్నారు. దాన్ని చూపించాడనికే ఆయన మీడియాను తీసుకుని జన్వాడ వెళ్లారు.
అయితే.. అక్కడ అప్పటికే పెద్ద ఎత్తున పోలీసుుల మోహరించి ఉండటంతో.. అరెస్ట్ చేసి పంపేశారు. కేటీఆర్‌ది కాబట్టే అక్కడ పోలీసులు అంత మంది ఉన్నారని.. నిబంధనలు ఉల్లంఘించిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. రేవంత్‌పై పాత ఆరోపణలే వస్తే… పదే పదే ప్రసారం చేసిన మెరుగైన చానల్… అదే యాజమాన్యానికి వాటాఉన్న చానళ్లు ..కనీసం రేవంత్ రెడ్డి పోరాటం…అరెస్టుల గురించి.. ఒక్క ముక్క కూడా ప్రసారం చేయలేదు. అయితే.. కవరేజీకి మాత్రం లోటు రానీయలేదు. రేవంత్ రెడ్డిని ఆయా పార్టీల చానళ్ల ప్రతినిధులు.. కమెరామెన్లు.. అన్ని కోణాల్లోనూ అనుసరించారు.