రేవంత్ నేరుగా మీడియాతో మాట్లాడితేనే ఫైర్ వర్క్స్ అవుతాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి కేసీఆర్ గురించి ఆయన మాట్లాడే మాటలు… వాడే పదాలతో బీఆర్ఎస్ నేతలకు బీపీ వస్తుంది. అలాంటిది ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్లు పెట్టి ఇంకా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట మీడియా ప్రతినిధులతో ముచ్చట్లు పెట్టిన రేవంత్ .. ఏడాదిలో కేసీఆర్ పేరు తుడిచేస్తానని ప్రకటించారు. తర్వాత కేటీఆర్, హరీష్ మధ్య గ్యాప్ పెంచేలా మాట్లాడారు.
ఇవి వెంటనే బీఆర్ఎస్ పెద్దలకు తెలిసిపోయాయి. వారికి బీపీ పెరగకుండా ఉంటుందా. కేసీఆర్ పేరును ఎవరూ చెరిపేయలేరని పెద్ద పెద్ద స్టేట్మెంట్లతో పాటు పాత వీడియోలన్నీ రిలీజ్ చేయించారు. నిజాని రేవంత్ ఆ మాటలన్నీ ఆఫ్ ది రికార్డు. తాను అలా అన్నానని నిరూపించాలని రేవంత్ అంటే బీఆర్ఎస్ దగ్గర సమాధానం ఉండదు. రేవంత్ రెడ్డి ఇలాంటి చిట్ చాట్లలో చాలా సార్లు సీరియస్ కామెంట్స్ చేశారు. అన్నీ రాజకీయపరమైనవే. వాటిపై బీఆర్ఎస్ నేతలు ఆవేశపడుతూంటారు. తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారని హరీష్ రావు అంటూ ఉంటారు.
రేవంత్ రెడ్డి ఇలాంటి పొలిటికల్ చిట్ చాట్లను తన రాజకీయ వ్యూహాల కోసం వినియోగించుకుంటారని అనుకోవచ్చు. అధికారంలోకి రాక ముందు ఓ సారి ఇలాగే చిట్ చాట్ చేసినప్పుడు బీఆర్ఎస్ ను పొగిడిన శశిథరూర్ పై రేవంత్ మండిపడ్డారు. ఓ జర్నలిస్టు దాన్ని రికార్డు చేసి కేటీఆర్ కు పంపారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టి కాంగ్రెస్ లో ఇలాంటి నేతలకు చోటు ఉంటుందా ఆని ప్రశ్నించారు. అలాంటి చిట్ చాట్లే ఇప్పుడు బీఆర్ఎస్కు సమస్యగా మారుతున్నాయి.