తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏమీ అనడం లేదు. రేవంత్ ను దెబ్బకొడితే కాంగ్రెస్ ను దెబ్బకొట్టినట్లే అన్న రాజకీయాన్ని అమలు చేస్తున్నారు. . నిజానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి. ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలి. కానీ రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచితే చాలని విజయం వస్తుందని..ఓటర్లు మారిపోతారని బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటున్నాయి.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనను టార్గెట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు .ఓ వైపు పీసీసీ చీఫ్ గా మరో వైపు సీఎంగా రెండు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. కింది నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డికి ఆ సామర్థ్యం ఉంది. కష్టపడి అనేకమంది ప్రత్యర్ధులను ఎదుర్కొని చాకచక్యంతో సందర్భానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి ఎదిగారు. ఆయన మరింత బలపడితే.. మిగతా పార్టీలకు ఇబ్బందికరమే.
అందుకే కాంగ్రెస్ లో ఆయనపై నమ్మకాన్ని తగ్గించేందుకు విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. రేవంత్ బీజేపీలో చేరుతారంటూ… కేటీఆర్, కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు. వీరు ఎన్ని చేసినా రేవంత్ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పది కిపైగా పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే రేవంత్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు మరింత ఎక్కువగా రేవంత్ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్లుగానే రాజకీయం మారుతుంది.