తెలంగాణ తెలుగుదేశం పార్టీకి దింపుడుకళ్లం ఆశ కూడా లేకుండా పోయే పరిస్థితికి తెచ్చాడు రేవంత్‌రెడ్డి. నానాటికీ తిసికట్టుగా తయారైన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఆఖరి దెబ్బ కొడుతూనే మరోవైపు ఆంధ్రా పార్టీని కూడా ఒక్క కుదుపు కుదిపేశాడు. పోయేవాడు పోకుండా పార్టీని రెంటికీ చెడిన రేవడిలా చేసేస్తున్నాడేమిటా అని తెలుగుదేశం అధిష్టానం రేవంత్ మీద కారాలు మిరియాలు నూరుతోంది.
అయితే అవతల ఉన్నది సాదా సీదా లీడర్ కాదాయె. మన గుట్టు మట్లన్నీ తెలిసిన మొండిఘటమాయె. అందుకే రేవంత్ మీద చర్యలు ఏమీ తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తోంది. దీనిపై ఏం చేయాలా అని తర్జనభర్జనలు పడుతోంది. రేవంత్ వ్యవహారం అటో ఇటో తేల్చాలని అధిష్టానాన్ని కోరాలనే నిర్ణయానికి కూడా టిటిడిపి నేతలు వచ్చినట్టు సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న రేవంత్ ఎపి టిడిపిపై చేసిన ఆరోపణలు ఆషామాషీవి కావు. ఇంకా అతడిపై చర్యలకు వెనుకాడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని టిటిడిపిలో రేవంత్ వ్యతిరేకులు భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే శుక్రవారం ఉదయం తెలంగాణ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రేవంత్‌పై చర్చించాలనేదే ఈ సమావేశం ప్రధాన అజెండా అనేది వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఎన్టీయార్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి రేవంత్ హాజరవడంతో ఖంగు తినడం టిటిడిపి నేతల వంతయింది. -నీ సంగతి తేల్చాలని మేం గుమి కూడితే నవ్వు మాతో కలిసి జత గూడితే ఎలా చచ్చేది?- అంటూ వీరు గింజుకులాడుతూన్నారు. ఈ సమావేశంలో హాట్ హాట్‌గా చర్చలు జరిగే అవకాశః ఉందంటున్నారు. సాయంత్రానికి దీని వివరాలు వెల్లడి కావచ్చు. ఏదేమైనా కెసియార్‌కు కొరకరాని కొయ్య అవుతాడనుకున్న రేవంత్ ప్రస్తుతానికి మాత్రం స్వంత పార్టీ గొంతులో పచ్చి వెలక్కాయలా మారాడు.