తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డిని అధికారికంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధాన పోటీ దారులు అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలతో ఇప్పటికే హైకమాండ్ మంతనాలు జరిపిందని… అన్ని సమీకరణాలు పరిశీలించి.. ఎవరికి ఇచ్చినా.. కలిసి పని చేస్తామనే మాట తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో హైకమాండ్ అన్ని రకాల ప్లస్‌లు..మైనస్సులు పరిశీలించి.. చివరికి.. రేవంత్ రెడ్డి వైపు మొగ్గిందని చెబుతున్నారు. అధికారిక ప్రకటన చేసే ముందు రేవంత్ ను ఓ సారి ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.
కొద్ది రోజుల నుంచి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రకటనను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలు చేయడానికి జగ్గారెడ్డి లాంటి నేతలు వెనుకడుగు వేయలేదు. అంతా వ్యూహాత్మకంగా జరుగుతుందని అనుకున్నారు. కొన్నాళ్ల కిందట.. రేవంత్ వ్యతిరేక వర్గం గాంధీభవన్‌లో సమావేశమై.. రేవంత్‌కు తప్ప ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తామనే సంకేతాన్ని హైకమాండ్‌కు పంపేందుకు ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం.. కాంగ్రెస్ హైకమాండ్ ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకునే పరిస్థితి లేదంటున్నారు.
రేవంత్ రెడ్డి ముందు నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న లీడర్ కాకపోవడం ఒక్కటే మైనస్. అయితే.. కర్ణాటకలో సిద్ధరామయ్య కూడా మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నేత కాదు. అయినా కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రిగా పదవులు పొందారు. పొటెన్షియాలటీ ముఖ్యమని.. హైకమాండ్ భావిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్ని కేసులు పెట్టినా.. ఎంత ఇబ్బంది పెట్టినా రేవంత్ మాత్రం.. కాంగ్రెస్ పై విధేయత చూపుతూనే ఉన్నారు. ఇతర నేతలు మాత్రం… ధిక్కరించడానికి తాము సిద్ధమన్నట్లుగా ప్రకటనలు చేశారు. ఇలా రేవంత్‌కు ప్లస్‌లు మైనస్‌లు ఉన్నాయి.. హైకమాండ్ అధికారిక ప్రకటన తర్వాతే.. టీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందన్నది తేలుతుంది..!