ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్‌రెడ్డికే బాధ్యతలు ఇవ్వనున్నారు. ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ప్రచారం చేయనున్నారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతుల తీసుకుంటే తన సహకారం ఉంటుందని గతంలోనే రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఇప్పుడు నేరుగా ఏపీ ఎన్నికల రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 11వ తేదీన విశాఖలో నిర్వహించబోయే నిరసనకు హాజరవుతారు. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి తొలి పర్యటన అదే అవుతుంది.
రేవంత్ రెడ్డికి వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, కార్యకర్తలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. సీఎం హోదాలో పాత పరిచయాలను సమన్వయం చేసుకుంటూ ఏపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ఆయన పావులు కదిపే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ తరపున పోటీ చేసేలా ఆయన ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండటం.. ఆ పార్టీకి ప్లసస్ అవుతుంది.
ఉమ్మడి అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన రాజకీయ నేతల వ్యాపారాలు ఎక్కువగా బెంగళూరులోనే ఉన్నాయి. వారితో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు మంచి సంబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం నెల రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి సంపూర్ణంగా పని చేసింది. . ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఏపీలోనూ తమ వంతుప్రయత్నాలు చేయనున్నాయి. ఎంత పుంజుకుంటే అంత భవిష్యత్ పై ఆశలు ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా ఏపీ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు.