మోజో టీవీ మూసివేత నిర్ణయంతో.. ఆ టీవీ చానల్లో పని చేస్తున్న జర్నలిస్టులంతా ఉద్యమబాట పట్టారు. అందర్నీ.. ఒక్క నెల జీతం అదనంగా తీసుకుని.. రాజీనామా చేయమని.. యాజమాన్యం హుకుం జారీ చేయడంతో.. అత్యధికమంది ఉద్యోగులు.. దానికి అంగీకరించడం లేదు. వారంతా ఉద్యమబాట పట్టారు. ఇప్పటికే జర్నలిస్టు సంఘాలను కలుపుకుని… ఈ విషయాన్ని పెద్దది చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే వారి పోరాటం.. బడా పారిశ్రామికవేత్తలపైన కావడం… తెలంగాణ సర్కార్లో వారికి ఉన్న పలుకుబడి… వారికి.. జర్నలిస్టు సంఘాల నేతలు కూడా ఎక్కువగా మద్దతు పలుకలేకపోతున్నారు. అందుకే మోజో టీవీ ఉద్యోగులు రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు.
మోజో టీవీకి టేకోవర్ చేసినట్లుగా భావిస్తున్న పారిశ్రామికవేత్తలతో.. ఎంపీ రేవంత్ రెడ్డికి ఉన్న వైరం ఈనాటిది కాదు. ఆయన చాలా కాలం నుంచి ఆ పారిశ్రామికవేత్తలపై పోరాడుతున్నారు. నందగిరి హిల్స్ దొర అని పేరు పెట్టి.. గతంలో విపరీతంగా విమర్శలు చేశారు. ఆ పోరాటాలు.. అలా కొనసాగిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డిని… తెలంగాణ సర్కార్.. ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి.. ఆ పారిశ్రామికవేత్తను టార్గెట్ చేయడం కూడా ఒకటని చెబుతారు. ఆ పారిశ్రామికవేత్త కూడా.. మీడియా చేతుల్లోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతగా టార్గెట్ చేయాలో.. అంతగా చేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు.. ఆయా టీవీ చానళ్లు చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు.. !
ఇప్పుడు.. రేవంత్ రెడ్డి.. మోజోటీవీ ఉద్యోగుల తరపున రంగంలోకి దిగితే.. కచ్చితంగా.. ఇదో రాజకీయ అంశం అవుతుంది. అసలు మోజో టీవీ ఎవరిది..? ఎలా చేతులు మారింది..?. ఎందుకు మూసేయాలనుకుంటున్నారు..?. అన్న విషయాలన్నీ బయటకు వస్తాయి. ఆ చానల్ ఎక్విప్ మెంట్ను రూ. 12 కోట్లకు అమ్ముకునే డీల్ ను ఇప్పటికే కొత్త యాజమాన్యం కుదుర్చుకుందనే ఆరోపణలు ఉద్యోగులు చేస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి .. సీరియస్గా దృష్టి పెట్టి రంగంలోకి దిగితే.. పారిశ్రామికవేత్తలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే అంచనా ఉంది.