మరో రెండు గ్యారంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ముఖ్యంగా మహిళల్లో ఎంతో పాజిటివ్ వేవ్ తీసుకు వచ్చే రూ. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకంతో పాటు , రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించాలనుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఇంద్రవెల్లి నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ప థకాల అమలు గురించి ప్రకటించే అవకాశం ఉంది.
రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత అధికారులతో ఇప్పటికే రేవంత్ రెడ్డి చర్చించారు. వీటి అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది? ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ప్రవేశ పెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి క్యాబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటారు.
ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఉచిత ప్రయాణం మహిళల్లో ప్రభుత్వంపై సానుకూలత పెరగడానికి కారణం అయింది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికి రెండు నెలలు అవుతోంది. అయితే మరో నెల రోజుల్లోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది. అందుకే .. వీలైనన్ని ఎక్కువ హామీలు అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.