జన్మభూమి కమిటీలు అయినా.. వాలంటీర్లు అయినా పేర్లే తేడా. అందరి పని పథకాల లబ్దిదారులను అధికార పార్టీకి ఓటు బ్యాంక్ గా మార్చడమే. ఇప్పుడు కొత్తగా సీఎం సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఈ కమిటీల ద్వారానే ప్రతి ఇంటికీ చేరనున్నాయని రేవంత్ ప్రకటించారు. ఏ పథకానికైనా లబ్ధిదారులను ఈ కమిటీల ద్వారానే ఎంపిక చేస్తారు.
ఈ కమిటీలన్నింటికీ.. ఉద్యోగ నియామకాల్లాంటివేమీ ఉండవు. నేరుగా కాంగ్రెస్ క్యాడర్ నే ఎంపిక చేస్తారు. కమిటీలోని ఒక్కో సభ్యుడికి నెలకు రూ. 6 వేల గౌరవ వేతనం ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80 వేల మందిని కమిటీల సభ్యుడిగా నియమించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందిరమ్మ కమిటీల ద్వారా నియమించే వారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలను ప్రచారం చేయడమే కాకుండా లబ్ధిదారులకు సామాజిక భద్రతా పింఛన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలను పంపిణీ చేయడం వంటి బాధ్యతలు అప్పగించనున్నారు.
ఇలా చేయడం ప్రజా ధనాన్ని క్యాడర్ కు ఇవ్వడమే అవుతుంది. అయినా రాజకీయ పార్టీలకు ఇప్పుడు ప్రజాధనంతో పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలుచేయడమే కామన్ అయిపోయింది. గతంలో టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల సభ్యులు ఎలాంటి జీతాలు చెల్లించేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వందలకోట్లు పార్టీ కార్యకర్తలకు వెచ్చించి.. ఓటర్లపై ఓ కన్నేసి ఉంచేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఇలాంటివి ప్రజల్లో వ్యతిరేకతకు కారణం అవుతున్నాయని తెలిసినా రాజకీయ పార్టీలు తగ్గకపోవడమే ఇక్కడ అసలు విశేషం.