ఎన్నికలకు ముందు అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లు హాట్ టాపిక్ అయ్యాయి. రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి ఏకంగా 30 ఏళ్లకు ఇచ్చేశారు. ఇందులో భారీ అవినీతి ఉందని.. రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు. ఆయనకు లీగల్ నోటీసులు పంపారు అధికారులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు ఆదేశించారు. హెచ్ఎండీఏ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్టబెట్టిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస ధర నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారంటూ అధికారులను ప్రశ్నించారు.
అందులో ఎవరెవరి ప్రమేయముంది? ఏయే సంస్థలున్నాయి? అనే విషయాలపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు. టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశిస్తూ హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీకి ఆ బాధ్యతలు అప్పగించారు. టెండర్లలో ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. టెండర్ల కేటాయింపుపై పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్లో చర్చించి సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు విచారణ బాద్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
30 ఏండ్ల లీజు గడువులో రూ.18 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం రావాల్సి ఉండగా, కేవలం రూ.7,380 కోట్లకు ఐఆర్బీ కంపెనీకి అప్పగించారు. హెచ్ఎండీఏ అనుసరించిన టెండర్ విధానంతోనే ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా నష్టపోయింది. టెండర్ దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో చేసుకున్న కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను చూపించి 49 శాతం వాటాను విదేశీ కంపెనీలకు అప్పగించింది. ఆ కంపెనీతో ఆ సంస్థ చేసుకున్న లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు.